ఘజియాబాద్‌ ఘటన: రాహుల్‌పై యోగి ఫైర్‌

16 Jun, 2021 08:19 IST|Sakshi

లక్నో: ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేసింది. ఇది మత కోణానికి సంబంధించిన క్రూర ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. మతానికి, మానవత్వానికి ఇది సిగ్గుచేటంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రాహుల్‌కి స్ట్రాంగ్‌ బదులిచ్చారు. 

‘‘రాముడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఆ పాఠం నీకు తెలియదు. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజాలు మాట్లాడవ్‌. ఈ ఘటనలో పోలీసులు ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా.. నువ్వు అబద్ధపు ప్రచారంతో సొసైటీలో విషం నింపాలని చూస్తున్నావ్‌‌. అధికార దాహంతో మానవత్వాన్ని అవహేళన చేస్తున్నావ్‌. ఉత్తర ప్రదేశ్‌ ప్రజల్ని అవమానించడం ఇకనైనా ఆపేయ్‌’’.. అంటూ ట్విట్టర్‌లో యోగి రాహుల్‌ ట్వీట్‌ ఫొటోకి ఘాటుగానే బదులిచ్చారు.

జూన్‌ 5న లోని ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తిని ఓ గ్రూప్‌ ఎత్తుకెళ్లి.. కత్తులతో బెదిరించడం, పాకిస్తాన్‌ స్పై అంటూ తిట్టడం, గడ్డం తీసేసిన ఘటన వైరల్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఇది మతకోణంలోని ఘటన కాదని స్పష్టం చేశారు. ఆ దాడిలో హిందు, ముస్లిం ఇరువర్గాల వాళ్లు ఉన్నారని, తాయెత్తులు అమ్మే సమద్‌ తీరు బెడిసి కొట్టడంతోనే వాళ్లు ఆ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.  
చదవండి: ఆమె ట్వీట్‌తో ఇరకాటంలో యోగి

మరిన్ని వార్తలు