ప్రయాగ్‌రాజ్‌ అల్లర్లు.. యోగి బుల్డోజర్ ఆపరేషన్, మాస్టర్‌ మైండ్‌ ఇంటి కూల్చివేత

12 Jun, 2022 17:05 IST|Sakshi

ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బుల్‌డోజర్లు రంకెలేశాయి. తాజా ప్రయాగ్‌రాజ్‌ అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు అక్కడి అధికారులు. నూపుర్‌ కామెంట్లకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కాస్త హింసకు దారి తీశాయి. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్లకు సంబంధించిన కేసులో మాస్టర్ మైండ్గా జావేద్‌ అహ్మద్‌ ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేవేతకు దిగింది.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. తాజా సహ్రాన్‌పూర్‌ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఇళ్లను ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారులు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు.

శుక్రవారం ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా జావెద్ అహ్మద్  ఉన్నాడు.  తాజాగా అతని ఇంటిని కూల్చేశారు ప్రయాగ్ రాజ్ అధికారులు. కరెయిలి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్‌  ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. అయినా భారీ బందోబస్తు మధ్య నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు. 

ఇదిలా ఉంటే.. వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఉద్యమకారుడైన జావేద్ అహ్మద్..  అక్రమంగా ఆ ఇంటిని నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు కూడా జారీ చేసింది. దాన్నొక అక్రమ భవనంగా ప్రకటిస్తూ.. మే 25న పీడీఏ జావేద్‌ అహ్మద్‌కు ఓ కాపీ కూడా పంపింది. తాజాగా రెండోసారి నోటీసులు పంపించారు. శనివారం ఉదయం 11 గంటలలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. లేకుంటే కూల్చివేత తప్పదని నోటీసులో పేర్కొన్నారు. అయినా జావేద్‌ భార్య, పిల్లలు ఇల్లు ఖాళీ చేయలేదు.  దీంతో జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. మొదట సామాగ్రిని బయటకు తెచ్చారు. తర్వాత బుల్డోజర్ తో ఇంటిని నేలమట్టం చేశారు. తమ తండ్రిని వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఇప్పుడు ఇంటిని కూల్చేశారని జావేద్‌ కూతురు అఫ్రీన్‌ ఫాతిమా ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. 

యూపీలో అల్లర్లకు పాల్పడితే  కఠినంగా శిక్షించాలని గతంలోనే సీఎం యోగీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది. నిందితుల ఇళ్లను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రయాగ్ రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 306 మందిని పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34,  సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్‌లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు