ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. ‘పిచ్చి ప్రేమ’తో బిచ్చగాడిలా..

23 Jul, 2022 13:42 IST|Sakshi
కన్యాకుమారి పోలీసులతో ముత్తు (మతి తప్పి భిచ్చగాడిగా మారిన ముత్తు )

ప్రేమ.. కొందరి జీవితాల్లో ఇది మధుర   జ్ఞాపకం.. మరికొందరకి ఇది మరణశాసనం. అవును.. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటూ.. మింగేసే అనకొండలూ ఉంటాయి.. ముఖ్యంగా వలపు వలలో చిక్కి.. బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో..ఈ లోకంలో! మనసిచ్చిన మగువ చీత్కరిస్తే.. వలచిన వనిత నిర్ధయగా వదిలేస్తే.. ఆ బతుకు నిత్యనరకం.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ.. స్వచ్ఛమైన ప్రేమకోసం పిచ్చివాడిగా మారిన ఓ యువకుడి దీనగాథకు మూడేళ్ల కాలం సాక్ష్యంగా.. నిలిచింది.. ఈ కన్నీటి వ్యథను మీరూ చదవండి..! 

సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడు ఉన్నత విద్యావంతుడు. ఎంతో కొంత అందగాడు కూడా.. పీజీ పూర్తి చేసి ఐఏఎస్‌ కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు సార్లూ విఫలం కావడంతో.. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతితప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. సమీప బంధువు కంట బడడంతో మూడేళ్ల దుర్భర జీవితం నుంచి బయటపడి తోబుట్టువుల చెంతకు చేరుకున్నాడు. వివరాలు.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో 35 ఏళ్ల యువకుడు ఒకరు మతితప్పిన స్థితిలో మూడేళ్లుగా సంచరిస్తున్నాడు.

కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్‌ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్‌ అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా, బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలుకరించాడు.  

మాట కలిసి.. మలుపు తిరిగి 
ఆ యువకుడు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్‌తో మాట కలిపాడు. అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారౖణెంది. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకెళ్లగా వారు ఆ యువకుడికి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండుకొట్టించారు. తరువాత స్నానం చేయించి కొత్త గుడ్డలు తొడిగి తెన్నమలైలోని అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి అతడు తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35)గా గుర్తించారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ 2018 నవంబర్‌ 13వ తేదీన తాను ఉంటున్న వర్కింగ్‌ బాయ్స్‌ హాస్టల్‌ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి జాడకానరాలే దు. ఈ నేపథ్యంలోనే మురుగన్‌ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా,వారు తగిన ఆధారాలు చూపి న తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. 

రెండుసార్లు ప్రేమ విఫలం కావడంతోనే.. 
ఈ సందర్భంగా ముత్తు సోదరుడు అయ్యనార్‌ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యారి్థనిని, ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు, అయితే ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్‌ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్‌ వల్ల మూడేళ్ల తరువాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశా డు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు.  ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీ సులు ఎంతో మానవత్వంతో తన సోదరుడిని క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. 

మరిన్ని వార్తలు