‘ఎర్రకోట’ ఎక్కిన యువకుడి అరెస్ట్‌

22 Feb, 2021 20:09 IST|Sakshi

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకం కావడం.. రైతుల మాటున గుర్తు తెలియని శక్తులు దూరి ఎర్రకోటను అధిరోహించి.. బీభత్సం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తి అరెస్టయ్యాడు. ఎర్రకోట శిఖరంపై కూర్చున్న వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారం కిందట ఒకరిని అదుపులోకి తీసుకోగా అతడి ద్వారా ప్రస్తుత యువకుడి ఆచూకీ లభించింది.

ఎర్రకోట ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు విచారణ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో వారం కిందట మహీంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఎర్రకోట ఘటనలో పాల్గొన్న జస్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. దీంతో 29 ఏళ్ల జస్‌ప్రీత్‌సింగ్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. సన్నీ అలియాస్‌ జస్‌ప్రీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా మహీంద్రసింగ్‌, జస్‌ప్రీత్‌ సింగ్‌ ఇద్దరూ ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ కార్ల ఏసీ మెకానిక్‌లు.

జస్‌ప్రీత్‌ సింగ్‌ ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపైకి ఎక్కి ఒక రాడ్‌తో పలు సంజ్ఞలు చేశారని పోలీసులు వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ ఫుటేజీ ద్వారా దాదాపు 200 మంది అనుమానితుల ఫొటోలు విడుదల చేశారు. వారిలో జస్‌ప్రీత్‌సింగ్‌ ఒకరు. మొత్తం 160 మంది ఈ హింసకు సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారు. జస్‌ప్రీత్‌సింగ్‌ను విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు