ఐటీ సిటీకి తగ్గని తలనొప్పి!

13 Jun, 2022 08:32 IST|Sakshi

బనశంకరి(బెంగళూరు): దక్షిణాదిలోనే ఉద్యాననగరి డ్రగ్స్‌కు నిలయంగా మారిందని అపకీర్తిని పొందింది. వీధి కార్మికులు, విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు డ్రగ్స్‌ మత్తుకు అలవాటు పడ్డారని ప్రచారం ఉంది. నగరంలో వీదేశీ పెడ్లర్లదే హవా. ఈ ఏడాదిలో తొలి 4 నెలల్లో 1,734 డ్రగ్స్‌ కేసులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదుకాగా 900 కిలోలకు పైగా డ్రగ్స్‌ ను పోలీసులు సీజ్‌ చేశారు. 2019లో 1,260 మంది అరెస్ట్, 2020లో 3,673 మంది డ్రగ్స్‌ దందాలో పట్టుబడ్డారు.  

60 శాతం బెంగళూరు వాటా  
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్‌ దందాలో బెంగళూరు వాటా 60 శాతానికి పైనే ఉంది. ఎంత పెద్ద పోలీస్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆటకట్టించడం సాధ్యం కావడం లేదు. గత ఏడాది ఐటీ సిటీలో రూ.100 కోట్ల డ్రగ్స్‌ వ్యాపారం సాగినట్లు అంచనా. ఇందులో 10 శాతం మాత్రమే పోలీసులకు దొరికింది. గంజాయి, హఫీం, కొకైన్, హషిష్, హెరాయిన్, కెటామిన్, ఎండీఎంఏ మాత్రలు, ఎల్‌ఎస్‌డీకి ఎక్కువ డిమాండ్‌ ఉంది.  

మత్తు పర్యవేక్షక దళాలు  
ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ ముఠాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రగ్స్‌ మానిటరింగ్‌ సెల్‌ ప్రారంభించాలని పోలీసు ఉన్నతాధికారులు తీర్మానించారు. ఒక్కో మానిటరింగ్‌ సెల్‌లో ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుల్స్‌తో కూడిన బృందం నిరంతరం డ్రగ్స్‌ సరఫరాదారులపై కన్నేసి ఉంచుతుంది. వారిని పట్టుకుని జైలుకు తరలించడం, బెయిల్‌ రాకుండా చూడడం కూడా బృందం పర్యవేక్షిస్తుంది. డ్రగ్స్‌ కేసుల విచారణ సత్వరమే పూర్తయ్యేలా సాక్ష్యాధారాలను సేకరిస్తారు. దక్షిణ విభాగంలో  ఇప్పటికే డ్రగ్స్‌ మానిటరింగ్‌ సెల్‌ సిద్ధమైంది.  

ఆన్‌లైన్‌లో మత్తు లావాదేవీలు
► సిటీలో హెణ్ణూరు, బాణసవాడి, కోరమంగల, కొత్తనూరు, రామమూర్తినగర, యలహంక, పుట్టేనహళ్లి, వైట్‌ఫీల్డ్, మారతహళ్లి, బెల్లందూరు ప్రాంతాల్లో డ్రగ్స్‌ బెడద అధికం.  
► డ్రగ్స్‌ విక్రయాలు వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్‌ మీడియా గుండా జోరుగా సాగుతున్నాయి. ఆన్‌లైన్లో సొమ్ము జమ చేస్తే ఇంటికి తెచ్చివ్వడం మామూలైంది. నైజీరియాతో పాటు ఆఫ్రికా దేశాల నేరగాళ్లు  ఇటువంటి నెట్‌వర్క్‌లను నడిపిస్తున్నట్లు పోలీస్‌ వర్గాల అంచనా.  
► టెక్కీలు, కాలేజీ విద్యార్థులు, శ్రీమంత యువతీ యువకులే డ్రగ్స్‌ విక్రయదారుల టార్గెట్‌  
► ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టయి నేరం రుజువైతే కనీసం పదేళ్లు జైలుశిక్ష పడుతుంది  
► సులభంగా బెయిల్‌ లభించడంతో జైలు నుంచి రాగానే మళ్లీ డ్రగ్స్‌ అమ్మడం పరిపాటి.  

మరిన్ని వార్తలు