ఉప్పొంగుతున్న నది.. బ్రిడ్జిపైనుంచి హీరోలా డైవ్ చేసిన యువకుడు.. చివరకు

15 Jul, 2022 11:02 IST|Sakshi

ముం‍బై: మహారాష్ట్ర మాలేగావ్‌లో ఓ 23 ఏళ్ల యువకుడి బిత్తిరి చర్య వైరల్‌గా మారింది. భారీ వర్షాలతో గిర్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పదుల సంఖ్యలో జనం బ్రిడ్జిపై నిలుచుని వరద ప్రవాహాన్ని చూస్తున్నారు. అంతలోనే ఓ యువకుడు నదీ ప్రవాహంలోకి హీరోలా డైవ్ చేశాడు. ఒక్క క్షణం అక్కడున్నవారికి ఏం జరుగుతుందో అంతుబట్టలేదు. ప్రవాహం ధాటికి ఆ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం  ఈ ఘటన జరిగింది. అతడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెండు రోజుల పాటు వెతికాయి. కానీ యువకుడి జాడ మాత్రం తెలియలేదు. దీంతో అతడు ప్రాణాలతోనే ఉ‍న్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ యువకుడు బ్రిడ్జిపై నుంచి ఎందుకు నదిలోకి దూకాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. నదిలోని ఉన్నవారిని కాపాడేందుకు డైవ్ చేశాడా? అనుకుంటే.. అప్పుడు నీటిలో చిక్కుకుని ఎవరూ లేరు. గురువారం రాత్రి వరకు గాలించిన సహాయక సిబ్బంది.. యువకుడి ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. అతని పేరు నయూం ఆమిన్ అని వెల్లడించారు.

మహారాష్ట్రలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి పలువురు కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పుణె, నాశిక్‌తో పాటు మరో మూడు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
చదవండి: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు! నిస్సహాయంగా అంతా చూస్తుండగానే..

మరిన్ని వార్తలు