ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్‌ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..

18 Jul, 2022 18:34 IST|Sakshi

బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్‌ రాజ్‌పుర్‌ నీర్‌సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్‌సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు.

ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి.

ధార్వాడ్‌ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉం‍డే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు.

వానలు పడినప్పుడు నీర్‍సాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్‌

మరిన్ని వార్తలు