కాసేపట్లో గమ్యం.. అంతలోనే ఘోరం.. మృత్యువు చేతిలో ఓడిన యూట్యూబర్‌ ‘స్కై లార్డ్‌’

29 Sep, 2022 19:35 IST|Sakshi

ఇండోర్‌: కరోనా టైం నుంచి యూట్యూబర్లకు క్రేజ్‌ పెరుగుతూ పోతోంది. వీళ్లలో జెన్యూన్‌గా జనం మెచ్చుకుంటున్నవాళ్లు చాలా అరుదు. వివాదాలకు, విమర్శలకు దూరంగా పేరు సంపాదించుకుంటున్న యూట్యూబర్లు.. కొంత మందే. అలాంటి వాళ్లలో ఒకడైన ‘స్కైలార్డ్‌ అభియుదయ్‌’ మిశ్రా ఇక లేడు. 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడియాడు ఈ యువ యూట్యూబర్‌. ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)కు చెందిన పాపులర్‌ గేమింగ్‌ యూట్యూబర్‌ అభియుదయ్‌ మిశ్రా. గరేనా ఫ్రీ ఫైర్‌, పబ్‌జీ తరహా మల్టీ షూటర్‌ మొబైల్‌ గేమ్స్‌పై వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటాడు. యూట్యూబ్‌లో 1.64 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు అతనికి. ఇన్‌స్టాగ్రామ్‌లో 425కే ఫాలోవర్స్‌ ఉన్నారు. 

గోల లేకుండా.. యూట్యూబర్లను ఆకట్టుకునేలా వీడియోలు చేయడం ఇతని ప్రత్యేకత. అయితే.. రెండు వారాల  కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో(iamskylord69) మిశ్రా పెట్టిన సెల్ఫీనే చివరిది. అతని మరణ వార్త విన్న అభిమానులు చివరి సెల్ఫీకి లైకులు, కామెంట్ల రూపంలో నివాళులర్పిస్తున్నారు. 

అభియుదయ్‌ మిశ్రాకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గుర్తించి.. అతన్ని పర్యాటక ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ భావించింది. ఇందులో భాగంగా.. సెప్టెంబర్‌ 21వ తేదీన ఖజురహో నుంచి టూరిజం బోర్డు నిర్వహించిన లాంగ్‌ బైక్‌ ర్యాలీలో అభియుదయ్‌ కూడా పాల్గొన్నాడు. సెప్టెంబర్‌ 27వ తేదీన వరల్డ్‌ టూరిజం డే సందర్భంగా ఈ యాత్ర ముగియాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి మరో రెండు కిలోమీటర్లు దూరం ఉండగా.. షోహగ్‌పూర్‌ వద్ద అభియుదయ్‌ బైక్‌ను ఓ ట్రక్కు రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ కన్నుమూశాడు మిశ్రా.

A post shared by SkyLord (@iamskylord69)

మరిన్ని వార్తలు