నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

23 Jul, 2021 18:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోంది’’ అని విజయసాయిరెడ్డి కేంద్రమంత్రికి వివరించారు.

అదే విధంగా... ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది’’ అని అన్నారు. ‘‘కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుంది’’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి సమర్పించిన వినతి పత్రంలో వివరించారు.

మరిన్ని వార్తలు