రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి సన్‌సద్‌ రత్న అవార్డు.. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

22 Feb, 2023 19:32 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు.  2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి. ఇందులో వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. సన్‌సద్‌ రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. జ్యూరీ కమిటీ ఈఏడాదికిగానూ పదమూడు మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఇందులో.. సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ  సభ్యులు టీకే రంగరాజన్‌కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించారు.

పార్లమెంట్‌లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సన్‌సద్‌ రత్న అవార్డులను 2010 నుంచి  అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్‌ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి ఎడిషన్‌ చెన్నైలో జరగ్గా.. ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. సంసద్ రత్న అవార్డులను భారత ప్రభుత్వం అందించదు. అయినప్పటికీ జ్యూరీలో మాత్రం ప్రభుత్వంలో వ్యక్తులను చేరుస్తున్నారు. 

పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. సన్‌సద్‌రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్‌ టీఎస్‌ కృష్ణమూర్తి సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్స్‌ బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా జ్యూరీ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తుంది. సభ్యుల పనితీరు డేటా PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించిన సమాచారం ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటుంది జ్యూరీ.

ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్‌ కాగా.. మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది.

మరిన్ని వార్తలు