కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి

31 Mar, 2022 14:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. ఆయనతోపాటు రానున్న రెండు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌న్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాగే రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యులు నరేష్‌ గుజ్రాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: (అఖిలేష్‌కు బీజేపీ చెక్‌.. రాజ్యసభకు శివపాల్‌?)

ఈ సందర్భంగా ఆయన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పనితీరును అభినందిస్తూ తాను అనేక పర్యాయాలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యానని ప్రతి అంశాన్ని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసే వారని అభినందించారు.

టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలన్నింటిలోకి పని తీరులో ఎప్పుడూ ముందంజలో ఉండే టీజీ వెంకటేష్‌ కమిటీని అధిగమించడానికి కామర్స్‌ కమిటీ చైర్మన్‌గా తాను తాపత్రయపడుతుండే వాడినని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్‌ అవుతున్న సహచర సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక వీడ్కోలు, అభినందనలు చెప్పారు.

చదవండి: (కర్ణాటకలో మొఘలుల పాఠ్యాంశాలకు గుడ్‌బై!)

మరిన్ని వార్తలు