ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం

28 Apr, 2023 15:01 IST|Sakshi

దేశంలోగాని, ఏదైనా రాష్ట్రంలోగాని ప్రజా ప్రభుత్వాల పాలనపై అసంతృప్తి పెల్లుబికినపుడు జనం రాజకీయాలపైన, రాజకీయ పక్షాలపైన విరుచుకుపడుతుంటారు. సరైన పరిపాలన అందించలేని ఆయా పాలక పక్షాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. కాని, కొన్ని సందర్భాల్లో జనం మొత్తంగా రాజకీయాలను, రాజకీయ పార్టీను దుయ్యబడుతూ ప్రజాస్వామ్యానికి పార్టీల వల్లే కీడు జరుగుతున్నట్టు మాట్లాడటం అభిలషణీయం కాదు.

ఎందుకంటే రాజకీయపక్షాలు లేని ప్రజాస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదు. రాజకీయ పార్టీల ఉనికి ప్రజల ఆదరణ, మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఓటర్లే నాయకులను లేదా ప్రజా ప్రతినిధులను (చట్టసభల సభ్యులను) ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రజలకు తమకు నచ్చిన పార్టీలను, నేతలను గద్దెనెక్కించడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఎన్నికలు ఓటర్లకు ఎనలేని అధికారాలు అందిస్తున్నాయి. అయితే, కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయపక్షాలు అధికారం కోసం పోటీపడే బహుళపక్ష ప్రజాస్వామ్యం అవసరం ఇంకా ఉంది.

పార్టీ రహిత ప్రజాస్వామ్యం మెరుగైనదని ప్రఖ్యాత రాడికల్‌ హ్యూమనిస్టు ఎం.ఎన్‌.రాయ్‌ వాదించినా ఇప్పటికిప్పుడు పార్టీలు లేని ప్రజాస్వామ్యం అమెరికా వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం సాధ్యం కాదు. శాంతియుత పద్ధతిలో పాలకపక్షాలను మార్చడానికి ప్రజలకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎలాంటి హింసకు ఆస్కారం లేకుండా దేశంలో ఆరో లోక్‌ సభ ఎన్నికల్లో (1977) ప్రజలు సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పాలకపార్టీని (భారత జాతీయ కాంగ్రెస్‌) అధికారం నుంచి తొలగించి కొత్త రాజకీయపక్షానికి (జనతాపార్టీ) అవకాశం కల్పించారు.
చదవండి: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్‌

కొత్త రాజకీయపక్షం అంతర్గత కీచులాటలతో హస్తినలో ప్రభుత్వం నడపలేక మూడు సంవత్సరాల లోపే కుప్పకూలిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత ఓటర్లు 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకే అధికారం కట్టబెట్టారు. 1956 నుంచీ ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉన్న పార్టీని 1983 జనవరిలో ఓడించిన జనం కొత్త ప్రాంతీయపక్షానికి అధికారం అప్పగించారు. అప్పటి నుంచి ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ద్వారా అధికారం కోసం పోటీ జరుగుతోంది. 

ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించేది రాజకీయపక్షాలే!
అన్ని ప్రాంతాల్లోనూ జాతీయపక్షాలకు పోటీగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు బలపడుతూ అవి స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినట్టు పరిపాలన అందిస్తున్నాయి. ఫలితంగా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో లేదా 20 ఏళ్లకో అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీ చేతుల్లోకి ప్రశాంతంగా బదిలీ అవుతోంది. వివిధ రాజకీయపక్షాలకు తమకంటూ సొంత అజెండా, కార్యక్రమాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల ప్రణాళిక ఉన్న కారణంగా ప్రజలకు ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అధికారం లేదా పరిపాలన అనే గమ్యం చేరడానికి రాజకీయపక్షాలే ప్రధాన రహదారులుగా ప్రజలకు ఉపకరిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటే వారు స్వయంగా తమను తాము పరిపాలించుకోలేరు కాబట్టి ప్రభుత్వ వ్యవస్థను నడిపే ప్రజా ప్రతినిధులను ఎంపికచేసి చట్టసభలకు పంపిస్తారు. ప్రజా ప్రతినిధులు రాజకీయపక్షాల ప్రతినిధులుగా గాక, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిస్తే అంతా గందరగోళం అవుతందనే అంచనాతోనే.. ఓటర్లు 95 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీల టికెట్‌ పై పోటీకి దిగే అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలిచే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది.
చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఏ ఒక్కరూ గెలవలేదు. ఎన్నికల ప్రక్రియ ద్వారా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు, రాజకీయాలకు కీలక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, పార్టీల నాణ్యత పెరగాలని ప్రజలు  కోరుకుంటూ ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాలేగాని రాజకీయపక్షాలు లేని పరిస్థితిని కోరుకోకూడదు.

అందుకే అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ (1809–1865) దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యంపై మాట్లాడుతూ, ‘ఎన్నికలు ప్రజలవే. వారి నిర్ణయమే ఎన్నికలు ప్రతిబింబిస్తాయి. చలిమంట ముందు వారు శరీరం వెనుక భాగానికి మంట తగిలేలా కూర్చుని, వీపులు కాల్చుకోవాలని నిర్ణయించుకుంటే–కాలిన గాయాలతో వారు కూర్చోవాల్సి ఉంటుంది,’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఓటర్లు వారి నిర్ణయాలకు వారే బాధ్యులనే విషయాన్ని లింకన్‌ గారు ఇంత చమత్కారంగా వర్ణించారు.


-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు

మరిన్ని వార్తలు