మూడేళ్ల సీక్రెట్‌ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!

10 Oct, 2022 18:13 IST|Sakshi

కంపెనీ యజమాని స్వయంగా వర్కర్‌లా మారి పని చేయడం లాంటి ఘటనలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే రీల్‌పై ఇలాంటివి సాధ్యమే గానీ రియల్‌ లైఫ్‌లో ఇలాంటివి చాలా అరుదనే చెప్పాలి. కానీ ఓ కంపెనీ సీఈవో స్థాయిలో ఉంటూ సాధారణ డెలివరీ బాయ్గా సేవలు అందించారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. అది కూడా ఒకటి, రెండు సార్లు కాదండోయ్‌, గత మూడు సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఆయన ఇలా డెలివరీ బాయ్‌లా మారి కస్టమర్లకు సర్వీస్‌ అందిస్తున్నాడట. వినడానికి ఆశ్చర్యంగా విన్నా ఇది నిజమే! ఈ విషయాన్ని నౌకరీ.కామ్‌ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్‌చందానీ తెలిపారు. దీని వెనుక అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా వెలుగోలోకి వచ్చింది!
దీపిందర్ గోయల్ సాధారణ జొమాటో డెలివరీ బాయ్ లాగా ఎర్ర టీషర్డ్ వేసుకుని ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారని నౌకరీ.కామ్‌ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్‌చందానీ తన ట్వీట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ట్వీట్‌లో.. కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతారని తెలిపారు. మోటార్ సైకిల్‌పై తాను ఆర్డర్లు డెలివరీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదని జోమోటో సీఈఓ దీపిందర్‌ చెప్పినట్లు ఆ ట్వీట్లో ప్రస్థావించారు.

సీక్రెట్‌గా మూడు నెలలకొక సారి.. 
ఒక స్టార్టప్ కంపెనీగా మార్కెట్లో వచ్చిన జొమోటో, అనతి కాలంలోనే తన కస్టమర్ల సంఖ్యను లక్షల నుంచి కోట్లకు మార్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే కంపెనీ స్టార్ట్‌ చేయడం, ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ స్థానాన్ని, కస్టమర్ల నమ్మకాన్ని, మార్కెట్లో ఉన్న కంపెనీ విలువలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పైగా ఏ కంపెనీకైనా కస్టమర్లకు అనుగుణంగా సేవలను అందించేందుకు ప్రాముఖ్యతనిస్తుంది.


ఈ క్రమంలోనే అసలు మార్కెట్లో కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకోవటం చాలా కీలకమని భావించారు Zomato CEO దీపిందర్‌ గోయల్‌. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక రోజంతా డెలివరీ బాయ్‌గా మారి సేవలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆధార్‌ కార్డ్‌లో ఆ అప్‌డేట్‌ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవ్‌!

మరిన్ని వార్తలు