జొమాటో వివాదం: పరారీలో హితేషా చంద్రాణి..!

17 Mar, 2021 14:03 IST|Sakshi

విచారణకు హాజరు కాని యువతి

కామరాజ్‌ ఫిర్యాదు చేసిన అనంతరం మహారాష్ట్ర వెళ్లిన యువతి

బెంగళూరు: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న జొమాటో వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెలివరీ బాయ్‌ తనను కొట్టాడని ఆరోపించిన యువతి హితేషా చంద్రాణి బెంగళూరు నుంచి పారిపోయినట్లు సమాచారం. డెలివరీ బాయ్‌ కామరాజ్‌ చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆమెని విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. కానీ ఆమె ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. మహారాష్ట్ర వెళ్లానని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కామరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేం చంద్రాణి మీద కేసు నమోదు చేశాం. విచారణకు రావాల్సిందిగా కోరాం. అయితే ఆమె ‘‘ప్రస్తుతం నేను సిటీలో లేను.. మహారాష్ట్రలోని మా బంధువుల ఇంటికి వెళ్లాను’’ అని తెలిపింది. బెంగళూరు వచ్చాక విచారణ​కు హాజరు కావాల్సిందిగా ఆదేశించాం. ఒకవేళ చంద్రాణి విచారణకు హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్‌ చేస్తాం’’ అన్నారు. అంతేకాక ప్రసుత్తం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. 

చంద్రాణి ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు కామరాజ్‌ను అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మీద విడుదలైన అతను చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా తనను అవమానించిందని.. నేరపూరిత బెదిరింపులకు పాల్పడిందని.. తన మీదకు షూ విసిరి అవమానించిందని.. తప్పుడు ఫిర్యాదుతో తన పరువు తీసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ వివాదంపై సోషల్‌ మీడియా రెండుగా చీలిపోయింది. బాలీవుడ్‌ హీరోయిన్‌లు సహా ఎక్కువ మంది నెటిజనులు డెలివరీ బాయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయల్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్‌ లీగల్‌ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి:
కొత్త ట్విస్ట్‌: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్

డెలివరీ బాయ్‌ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్‌ హీరోయిన్‌

మరిన్ని వార్తలు