Zydus Vaccine కమింగ్‌ సూన్‌: పేరెంట్స్‌కు భారీ ఊరట

9 Jul, 2021 10:38 IST|Sakshi

12-18 ఏళ్ల  పిల్లలకు జైడస్  టీకా అందుబాటులోకి

అత్యవసర వినియోగం కింద సెప్టెంబరు నుంచే!

రెండో దేశీయ కరోనా వ్యాక్సిన్‌ జైడస్‌ కాడిలా

సాక్షి,  న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపనుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య  వారికి కూడా టీకా అందుబాటులోకి రానుంది. రెండో దేశీయ టీకా జైడస్ క్యాడిలా త్వరలో అందుబాటులోకి వస్తోంది. 12-18 ఏళ్ల పిల్లలకు జైడస్ టీకాతో వ్యాక్సినేషన్‌ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుందని ప్రభుత్వ  అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. 

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కోవిడ్  మూడో దశ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన మధ్య  పిల్లలకు టీకాలు వేయడంపై  కేంద్రం దృష్టి  సారిస్తోంది. సెప్టెంబర్ నాటికి  పిల్లలకు వ్యాక్సినేషన్‌  ప్రారంభమవుతుందని టీకా అడ్మినిస్ట్రేషన్‌ జాతీయ నిపుణుల బృందం చీఫ్‌ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు.  ఈ టీకా ట్రయల్‌ డేటా సమర్పించిన అనంతరం అత్యవసర వినియోగం కింద జైడస్ వ్యాక్సిన్‌కు మరికొద్ది వారాల్లోనే అనుమతినిస్తామన్నారు. స్కూళ్లు ప్రారంభం, ఇతర అంశాలు కీలకమని, దీన్ని పరిగణనలోకి తీసుకొని తీవ్రంగా చర్చించినట్టు ఆయన చెప్పారు. ఆ తరువాత కోవాక్సిన్‌కు అందుబాటులోకి వస్తుందన్నారు. కోవాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభ మయ్యాయి. సెప్టెంబర్ చివరి నాటికి కోవాగ్సిన్‌ టీకా కూడా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ఏడాది మూడవ త్రైమాసికానికి లేదా జనవరి-ఫిబ్రవరి ఆరంభం నాటికి  2-18 సంవత్సరాల మధ్య వారికి కూడా  వ్యాక్సిన్‌ అందించాలని భావిస్తున్నట్టు చెప్పారు.  

కాగా  పిల్లలపై మూడో వేవ్‌ ప్రభావం అంచనాలను  పిల్లల వైద్య నిపుణుల సంఘాలతోపాటు, కొంతమంది నిపుణులు  కూడా  కొట్టి  పారస్తున్నారు. పిల్లలకు కరోనా నుంచి రక్షణ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమవుతోందనీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ క్రమంలో పిల్లల కోసం 4000 ప్రత్యేకమైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను, 736 జిల్లాల్లో  ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు