ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌..

20 Nov, 2023 23:30 IST|Sakshi
● దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల కోసం ఏర్పాట్లు ● 22, 23 ,24 తేదీల్లో ఇంటి నుంచే ఓటింగ్‌ ● ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ ● నియోజకవర్గాల వారీగా టీంలు ఏర్పాటు ● జిల్లాలో 468 మంది దరఖాస్తు

నిర్మల్‌చైన్‌గేట్‌: ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈనెల 22, 23, 24 తేదీల్లో ఇంటి నుంచే ఓటు వేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

ఇళ్ల వద్దకే అధికారులు..

దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారులు హోం ఓటింగ్‌ షెడ్యూల్‌ వివరాలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. అలాగే ఓటర్లకు ఇప్పటికే బీఎల్‌ఓలు సమాచారం అందజేశారు.

మూడు నియోజకవర్గాల్లో..

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 7,23,389 మంది ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 21,312 మంది ఉన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో ఫారం 12డి ద్వారా 229 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 180 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఫారం 12డి ద్వారా 135 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 64 మంది మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ముధోల్‌ నియోజకవర్గంలో ఫారం 12డి ద్వారా 224 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 224 మంది ఓటు హక్కు పొందారు.

రెండుసార్లు అవకాశం...

22వ తేదీన ఓటరు ఇంటికి ఎన్నికల అధికారులు వెళ్తారు. ఒక వేళ ఆ సమయంలో ఓటరు ఇంట్లో లేనిపక్షంలో తిరిగి 23న వస్తామని, ఇదే చివరి అవకాశం అని ఓటరుకు అధికారులు తెలియజేస్తారు. రెండోసారి వెళ్లినప్పుడు కూడా ఓటరు లేకపోతే అతను ఓటు వేసే అవకాశం కోల్పోతాడు.

రహస్య ఓటింగ్‌ విధానం...

ఇంటి వద్దనే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కును స్వే చ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటరు ఇంటికి ఎ న్నికల సిబ్బంది మొబైల్‌ వాహనంలో చేరుకుని ఓ టరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన చోట ఓటరు రహస్యంగా తన ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఇద్దరు పోలింగ్‌ అధికారులు, పోలీసు అధికారితోపాటు ఓ వీడియో గ్రాఫర్‌ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటరు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే ప్రక్రియంతా వీడియో తీస్తారు.

మరిన్ని వార్తలు