అకాల వర్ష బీభత్సం

19 Mar, 2023 01:00 IST|Sakshi
చావునితండాలో కురుస్తున్న వడగండ్ల వాన.. దుబ్బాకలో కురిసిన వడగండ్లు (ఇన్‌సెట్‌లో)

ఉమ్మడి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. అకాల వర్షంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామ పొలిమెరల్లో తాటి చెట్టుపైన పిడుగుపడటంతో మంటలు అంటుకున్నాయి. తున్కిపల్లి గ్రామంలోని సిర్నపల్లి సాంబయ్య ఇంటి పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. జుక్కల్‌ చౌరస్తా కరెంట్‌ స్తంభాలు కిందకు వంగాయి. బిచ్కుంద రోడ్డు మార్గంలో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

లింగంపేట: మండలంలోని బాణాపూర్‌ తండా, మోతె, వండ్రికల్‌ గ్రామాల శివారులో వడగండ్ల వాన కురిసింది. వడగళ్లు భారీగా పడటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షంతో పాటు ఈదురు గాలులు, వడగండ్లు కురియడంతో గుడిసెల పైకప్పులు, పాకల రేకులు పైకిలేచాయి. పంట చేనుల్లో మామిడి కాయలు రాలాయి. మామిడి చెట్లకు, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. బాణాపూర్‌ తండాలో భారీగా వడగళ్లు పడ్డాయి.

బాన్సువాడటౌన్‌: బాన్సువాడలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని స్టేట్‌ బ్యాంకు సమీపంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. వాహనాలను పోలీస్‌ స్టేషన్‌ ముందు నుంచి తాడ్కోల్‌ చౌరస్తాకు మళ్లించారు. వరి పంటలు నేలకొరిగాయి.

గాంధారి: మండలంలోని వండ్రికల్‌, గుర్జాల్‌, బ్రాహ్మణ్‌పల్లి, మాతుసంగెం, పేట్‌ సంగెం గ్రా మాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వడగండ్ల వాన కురిసింది. మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వండ్రికల్‌, మాతు సంగెం, గుర్జాల్‌ గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న నేలకొరిగింది.

మద్నూర్‌: మద్నూర్‌, డోంగ్లీ మండలాల్లో జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా వరుసగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దకొడప్‌గల్‌: మండల కేంద్రంతో పాటు చావుని తండా, శివాపూర్‌, పోచారం తండా, తలాబ్‌ తండాలల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది.

రుద్రూర్‌: రుద్రూర్‌ మండలం రాణంపల్లి శివారులో కోటగిరి–రుద్రూర్‌ ప్రధాన రహదారిపై రెండు వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

ధర్పల్లి: మండలంలోని దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో వర్షానికి వరి పంటకు నష్టం వాటిల్లింది. పాల దశలో ఉన్న వరి గింజలు నేల రాలిపోయాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న నేలకుఒరిగింది. మామిడి నేలరాలింది. మిరప, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

ఎడపల్లి: మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో వడగండ్ల వర్షంతో వరి పంట నష్టం వాటిల్లింది. గ్రామంలో 400 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లిందని ఏవో సిద్దిరామేశ్వర్‌ తెలిపారు.

పసుపు పంటకు నష్టం

బాల్కొండ: అకాల వర్షంతో ఉడికించి కళ్లాల్లో ఆరబెట్టిన పసుపు పంట తడిసి ముద్దయింది. పసుపు పంటను ఆరబెట్టిన తర్వాత తడిస్తే చందూరం(ఎరుపు రంగు) ఏర్పడుతుంది. దీంతో మార్కెట్‌లో సగం ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయారని రైతులు వాపోతున్నారు. అసలే దిగుబడి లేక, ధర లేక దిగులుగా ఉన్న పసుపు రైతుకు ములిగేనక్క మీద తాటికాయ పడ్డాట్టు వర్షం వెంటాడుతుంది. మక్క పంట కొంత నూర్పిడి చేసి రోడ్లపై ఆరబెట్టారు. ఆరబెట్టిన మక్కలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నూర్పిడి చేయని మక్కపంట నేలకొరిగింది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వడగండ్ల వానతో పంటలకు నష్టం

ఆందోళనలో అన్నదాతలు

ఈదురు గాలులకు అదుపుతప్పి..

నస్రుల్లాబాద్‌ (బీర్కూర్‌) :బీర్కూర్‌ మండలం అన్నారం వద్ద శనివారం సాయంత్రం ఈదురు గాలుల బీభత్సానికి ఆటో, బైక్‌ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర సగ్రొల్లికి చెందిన ఆటో బాన్సువాడలో శుభకార్యానికి వెవెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, బీర్కూర్‌ నుంచి కొల్లూరు వెలుతున్న బైక్‌ ఈదురు గాలులకు అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న కొల్లూరుకు చెందిన చాకలి సాయిలు కాలు విరిగింది. ఆటో చివరలో కూర్చున్న సగ్రొల్లికి చెందిన మారుతి రెండు కాళ్లు విరిగాయి. స్థానికులు క్షత గ్రాతులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు