ఒంటరి మహిళలే లక్ష్యంగా!

24 Jul, 2023 00:26 IST|Sakshi

నిజామాబాద్‌: ఒంటరి మహిళలే లక్ష్యంగా జి ల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ద్విచక్రవాహనాలపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. అంతేగాకుండా రద్దీ ఎక్కువగా ఉండే అంగడి లాంటి ప్రాంతాల్లో సైతం చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని గొలుసులను సైతం చోరీ చేస్తున్నారు. అడ్రస్‌ అడగినట్లు వచ్చి చైన్‌ లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్‌లో ఓ మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.

కరువైన నిఘా..

పోలీసులు నిఘా లోపించడంతో చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. సీసీ పుటేజీలను ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ లేకపోవడంతో అవి సక్రమంగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచి చైన్‌ స్నాచర్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

ఈ నెల 18న నిజామాబాద్‌లోని మహాలక్ష్మి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.

► పదిహేను రోజుల క్రితం ఆర్మూర్‌లోని కుమ్మరిగల్లీకి చెందిన మీనాక్షి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు.

► రెండు నెలల క్రితం ఆర్మూర్‌లోని తిరుమల కాలనీలో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల చైన్‌ను లాక్కెళ్లారు.

అనుమానం వస్తే స్థానికులకు చెప్పాలి

ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఎవరైన బైక్‌పై మెల్లగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికంగా ఉండే వారికి విషయం చెప్పాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు డయల్‌ 100కు కాల్‌ చేయాలి. – కిరణ్‌కుమార్‌, ఏసీపీ, నిజామాబాద్‌

మరిన్ని వార్తలు