Nizamabad: వ్యాపార కేంద్రాలుగా ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లు!

11 Jan, 2024 12:32 IST|Sakshi

జిల్లాలో జోరుగా ‘ఇన్‌ఫెర్టిలిటీ’ దందా

చికిత్స పేరిట రూ. లక్షల్లో వసూలు

సక్సెస్‌ రేటు రెండు శాతమే..!

అనుమతి లేని కేంద్రాలే అధికం

అధికారుల పర్యవేక్షణ అంతంతే..

నందిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సావిత్రి, రాజు(పేరుమార్చాం) దంపతులకు ఆలస్యంగా పెళ్లయ్యింది. నాలుగేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో జిల్లా కేంద్రంలోని ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రానికి వెళ్లారు. ప్రముఖ వైద్యురాలు పరీక్షించి స్కానింగ్‌లు చేయించి మందులు వాడాలని సూచించారు. ఫలితం లేకపోవడంతో ఐయూఐ, అటు తర్వాత ఐవీఎఫ్‌ చేసినా సంతానం కలగలేదు.

ఇందుకోసం సుమారు రూ. 3లక్షలతో పాటు అదనంగా మందుల కోసం రూ. లక్షా 50వేలు ఖర్చయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా చాలామంది దంపతులు పిల్లల కోసం అప్పులు చేసి చికిత్స చేయించుకున్నా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు దత్తత తీసుకుంటున్నారు.

నిజామాబాద్‌నాగారం: పిల్లలు పుట్టక ఆవేదన చెందుతూ.. సంతానం కోసం పరితపిస్తున్న దంపతుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుని జిల్లాలో ‘ఇన్‌ఫెర్టిలిటీ’ దందాను జోరుగా నిర్వహిస్తున్నారు. సంతానం కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మొద ట మూడు నుంచి ఆరు నెలల పాటు ట్రిట్‌మెంట్‌ తీసుకోవాలని సూచిస్తారు.. అటు తర్వాత ఏడాది కోర్సు అని.. ఇంకా పిల్లలు పుట్టకపోతే రెండు నుంచి మూడేళ్ల కోర్సు అంటూ నమ్మబలుకుతూ డబ్బు లు వసూలు చేస్తున్నారు.

అయినా ఫలితం లేకపోతే ఐయూఐ, ఐవీఎఫ్‌ పేరిట రూ. లక్షలు గుంజుతున్నారు. చివరకు సంతానం కలగకపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. వీటి సక్సెస్‌ రేటు 20శాతం ఉంటుందని వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి కేవలం రెండు శాతం మాత్ర మే ఉంటుందని సమాచారం. ఒకవైపు ఈ తతంగమంతా అనుమతి ఉన్న కేంద్రాల్లో సాగుతుండగా.. మరోవైపు అనుమతి లేకుండా జిల్లాలో చాలా కేంద్రాలు కొనసాగుతున్నాయి.

అనుమతి లేకున్నా వైద్యం
యాంత్రిక జీవనంలో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడంతో పాటు దంపతుల్లో సమస్యలు ఉండడంతో కొందరికి సంతానం కలగడంలేదు. పిల్లలు పుట్టడం లేదనే ఆందోళనతో ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో నాలుగైదేళ్లుగా వీటికి డిమాండ్‌ పెరిగింది. దీంతో జిల్లాలో సంతాన సాఫ ల్య కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. వీటిలో అనుమతి పొందిన కేంద్రాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి.

అనధికారికంగా చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో సంతానం కోసం చికిత్సలు అందిస్తున్నారు. కొందరు గైనకాలజిస్టులు అనుమతి లేకుండానే వైద్యం చేస్తున్నారు. పల్లెల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు సైతం ఫలానా ఇన్‌ఫర్టిలిటీ కేంద్రానికి వెళ్తే పిల్లలు పుడతారంటూ చెప్పి మరీ పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కూడా కమీషన్లు ఉండడం గమనార్హం. ఏదేమైనా రూ. లక్షలు ఖర్చు చేసి నెలలు, సంవత్సరాల పాటు చికిత్స పొందినా ఫలితం ఉండకపోవడంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు.

పర్యవేక్షణ కరువు
జిల్లాలో ఇన్‌పెర్టిలిటీ కేంద్రాల పేరిట యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే అనుమతి ఉంది. వీటి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారో సంబంధిత అధికారులు తూతూమాత్రంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్‌, ఫీజుల విషయంలో సైతం పట్టించుకోవడం లేదు. కేంద్రాల నుంచి కూడా ‘మామూళ్లు’ ముడుతుండడంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిర్యాదులు వస్తే చర్యలు
ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాల్లో సంతానం కోసం చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఏమైనా తేడా జరిగినట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాం. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంతాన సాఫల్య కేంద్రాల చికిత్స విధానంలో సక్సెస్‌ రేటు ఎంత అనే విషయం నాకు తెలియదు. – గంగాధర్‌, ఇన్‌చార్జి ఏవో

పర్యవేక్షణ చేయిస్తాం
జిల్లాలో అనుమతి పొందిన ఫెర్టిలిటీ కేంద్రాలు ఆరు మాత్రమే ఉన్నాయి. ఇందులో కచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏవో గంగాధర్‌ను పర్యవేక్షణ చేయాలని ఆదేశించాం. తేడాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ సుదర్శనం, డీఎంహెచ్‌వో

>
మరిన్ని వార్తలు