Digital Library: అరచేతిలో పుస్తక భాండాగారం 

30 Aug, 2021 21:10 IST|Sakshi

సాక్షి, కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌): కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది నుంచి గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయి. ఒకవేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి నెలకొంది. తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్‌ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చింది.

నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసి ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్‌ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి.  

ఖరగ్‌పూర్‌ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌నెట్‌లో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా పేరుతో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను పొందుపరిచారు. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు.

పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపరిచారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్‌ఈ సిలబస్‌), లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్‌ పుస్తకాలు, మత గ్రంథాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ఉండగా, సైట్‌ ఒపెన్‌ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

వినియోగం ఇలా... 
స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ల ద్వారా డిజిటల్‌ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్‌నెట్‌ గూగుల్‌లో ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ టైప్‌ చేస్తే డిజిటల్‌ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయి రిజిస్టర్‌ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ లైబ్రరీలో వీడియోల ద్వారా సైతం విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా అని టైప్‌ చేసి డిజిటల్‌ లైబ్రరీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌ పెట్టుకుంటే కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఈ మెయిల్‌ ద్వారా మెసేజ్‌ వస్తుంది. 

ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి... 
ఉమ్మడి జిల్లాలో 44 గ్రంథాలయాలు ఉండగా, 85 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సుమారు 6 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి పాఠకులతో కళకళలాడేవి. కరోనాతో గ్రంథాలయాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది.   

చదవండి: ఫోన్‌ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా?

మరిన్ని వార్తలు