అబుదాబిలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15 Aug, 2021 21:17 IST|Sakshi

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో  75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబుదాబిలో ప్రవాస భారతీయులకు కేంద్ర బిందువైన ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో, కళా ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ  వేడుకలను జరుపుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకెన్‌ తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మెహ్రా అల్‌ మెహ్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ అధ్యక్షుడు జార్తి వరీస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జార్తీ వరీస్‌ మాట్లాడుతూ.. ఎందరో త్యాగ మూర్తుల బలి దానాల ఫలితమే ఈ రోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్చ వాయువులని, భావి భారత నిర్మాణం లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతయినా ఉందని తెలియ జేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కోవిడ్‌ సమయం లో సంస్థ సభ్యులు బీరన్‌, యూనిస్‌   వారు చూపిన సమాజ స్పూర్తి కి గౌరవ పురస్కారాన్ని అందజేశామని  సంస్థ సంక్షేమ కార్య దర్శి రాజా శ్రీనివాసరావు వెల్లడించారు.

భారత ప్రభుత్వ పిలుపు మేరకు సాయంత్రం జరిగిన ఆజాది కి అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా దేశం లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన, నాట్య కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో గుజరాత్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల వారి  కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకర్షించింది.

భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ గాన  నాట్య కళా ప్రదర్శన జరిగింది.  సాయంత్రం జరిగిన కార్యక్రమానికి లూలూ గ్రూపుల సంస్థ చైర్మన్‌ , ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ చైర్మన్‌ పద్మశ్రీ డా యూసుఫ్‌ అలీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం లో సంస్థ క్రీడా కార్యదర్శి ఫ్రెడీ, ఉప ప్రధాన కార్య దర్శి జార్స్‌ వర్గీస్‌,  ఉప కోశాధికారి దినేష్‌, జనరల్‌ మేనేజర్‌ రాజు తదితర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు