లండన్‌ - హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌లో లీక్‌.. అత్యవసర ల్యాండింగ్‌..

18 Nov, 2021 10:53 IST|Sakshi

లండన్‌ నుంచి హైదరాబాద్‌కి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో దారి మళ్లించారు. విమానాన్ని టర్కీలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసి అక్కడ నుంచి మరో విమానంలో ప్ర​యాణికులను సురక్షితంగా ఇక్కడికి తీసుకువచ్చారు. గత వారం ఈ ఘటన జరగగా వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 

అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తి వేయడంతో ఇండియా ఇంగ్లండ్‌ల మధ్య మళ్లీ విమాన సర్వీసులు ఇటీవల మొదలయ్యాయి. నవంబరు 11న లండన్‌ నుంచి హైదరాబాద్‌కి బయల్దేరిన ఎయిర్‌ ఇండియాకి చెందిన ఏఐ 148 విమానం బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో ఆకాశంలో ఉండగా విమానం ఫ్యూయల్‌ ట్యాంకులో లీకేజీలు ఉన్నట్టు పైలట్లు గుర్తించారు.

విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాలను వెంటనే సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు అధికారులకు పైలెట​‍్లు చేరవేశారు. దీంతో టర్కీలోని అంకారా ఎయిర్‌పోర్టులో ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులను అక్కడి నుంచి మరో విమానంలో భారత్‌కి తరలించారు.

విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఇంజనీర్ల బృందం అంకారా బయల్దేరి వెళ్లింది. సమస్యను సరి చేసి ఫ్లైట్‌ని ఇండియాకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ విచారణకు ఆదేశించింది. 

చదవండి: ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్‌ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు

మరిన్ని వార్తలు