ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ సర్వీసులు..

15 Nov, 2021 19:59 IST|Sakshi

కోవిడ్‌ ఆంక్షలు సడలించి ఇండియా అమెరికాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతి ఇచ్చిన శుభసందర్భంగా ఇరు దేశాల మధ్య నాన్‌స్టాప్‌ విమానాలు షురూ అయ్యాయి. అమెరికా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ఇప్పటికే సర్వీసులు ప్రారంభించింది. మరిన్ని సర్వీసులు ప్రారంభించేందుకు సన్నహకాలు చేస్తోంది.
దుబాయ్‌ మీదుగా
ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు ఎప్పటి నుంచో బాగానే ఉన్నాయి. దీనికి తోడు ఐటీ విప్లవం వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మండలం నుంచి కనీసం నలుగురైదురగు అమెరికాలో నివసించే పరిస్థితి నెలకొంది. అయితే ఇండియా నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు చాలా తక్కువ. చాలా వరకు దుబాయ్‌, యూఏఈ లేదా యూరప్‌ వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ద్వారా యూఎస్‌ వెళ్తుంటారు. 
2012లో రద్దు
అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ 2007లో షికాగో నుంచి న్యూఢిల్లీకి నాన్‌స్టాప్‌ ఫ్లైట్లను ప్రారంభించింది.  అయితే ఐదేళ్ల తర్వాత ఆ సంస్థ షికాగో - న్యూఢిల్లీ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ తర్వాత కోవిడ్‌ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొత్తానికే విమాన సర్వీసులు రద్దు చేశారు.
న్యూయ్యార్క్‌ టూ ఢిల్లీ
గడిచిన పదేళ్లలో ఇండియా అమెరికాల మధ్య రాకపోకలు పెరిగాయి. అనేక కుటుంబాలు ఎన్నారైలుగా అమెరికాలో ఉంటున్నారు. ఇండియాలో సైతం ఎయిర్‌లైన్స్‌ మార్కెట్‌ రోజురోజుకి పుంజుకుంటోంది. దీంతో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ మార్కెట్‌లో వాటా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించింది. గత అక్టోబరులో ఈ విమానం ప్రారంభం కావాల్సి ఉండగా నవంబరుకు వాయిదా పడింది. తొలి విమానం గత శనివారం (2021 నవంబరు 13)న ఢిల్లీకి చేరుకుంది. వీకెండ్‌లో ఈ సర్వీసు అందుబాటులో ఉంది.


బెంగళూరుకి
రెండో విమాన సర్వీసును అమెరికాలోని సియాటెల్‌ నుంచి బెంగళూరు మధ్య మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌. ఆ తర్వాత న్యూయార్గ్‌ - ముంబై, శాన్‌ఫ్రాన్సిస్కో- బెంగళూరుల మధ్య మరో రెండు సర్వీసులు ప్రారంభించాలనే యోచనలో ఉంది. 
బోయింగ్‌ 777
నాన్‌స్టాప్‌ సర్వీసులకు బోయింగ్‌ 777 విమానాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 304 మంది ప్రయాణం చేయవచ్చు. ఎకానమీ 216, ప్రీమియం ఎకానమీ 28, బిజినెస్‌ క్లాస్‌ 52, ఫస్ట్‌క్లాస్‌ 8 సీట్ల వంతున అందుబాటులో ఉన్నాయి. భారతీయ అభిరచులకు తగ్గట్టు ఫుడ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.
ఇండిగోతో జట్టు 
అమెరిక్‌ ఎయిర్‌లైన్స​ ఇండియాలో ఇండిగోతో జట్టు కట్టింది. నాన్‌స్టాప్‌ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణికులు దేశీయంగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా ఇండిగో ఏర్పాటు చేస్తుంది. అమెరిక్‌ ఎయిర్‌లైన్స్‌ టిక్కెట్‌ కలిగిన ‍ ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో లాంజ్‌లను వినియోగించుకోవచ్చు. ఇదే తరహాలో మరికొన్ని సౌలభ్యాలు అందిస్తున్నారు.

చదవండి:ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్‌ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు

మరిన్ని వార్తలు