ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన

26 May, 2021 22:11 IST|Sakshi

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుంచి 4వ అన్నమయ్య శతగళార్చన ఆన్లైన్ పద్దతిలో  ఫేస్బుక్ , యూట్యూబ్ లైవ్  ద్వారా ఘనంగా నిర్వహించారు. మూడుగంటలపాటు నిర్వహించిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ ద్వారా  2500కి పైగా వీక్షణలు వచ్చాయని నిర్వాహకులు తెలియచేశారు. మే 26, 2020 అన్నమయ్య జయంతి నాడు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, సప్తగిరి సంకీర్తనలను పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది.

ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో పిల్లలు నమోదు చేసుకోగా, వారి నుంచి ఎంపికైన 25 మంది పిల్లల కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు. అలాగే 180 మందికి పైగా పాడిన 7 సప్తగిరి సంకీర్తనలను శతగళార్చనగా కూర్చి, వాటిని ఈ కార్యక్రమం ద్వారా విడుదల చేశారు.  పెద్దలు వివిధ ప్రాంతముల నుంచి తమ కీర్తనలతో  అందరినీ అలరించారు. సింగపూర్, భారత దేశములనుంచే కాక అమెరికా, యూకే, మలేషియా దేశాల నుంచి కూడా పాల్గొనుట ఈ సారి కార్యక్రమానికి మంచి శోభను చేకూర్చింది. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, చిన్నారులు మౌర్య, దంటూ శ్రీయలు వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు.    

 
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గణనాధ్యాయి, భాగవత ప్రచార సమితి వ్యవస్థాపకులు ఊలపల్లి సాంబశివరావు గారు విచ్చేసి అన్నమయ్య ప్రాశస్త్యాన్ని గురించి  చక్కటి సందేశం ఇచ్చారు.  అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్ గారు, రామాంజనేయులు చమిరాజు గారు వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.  ఈ అంతర్జాల అన్నమయ్య శతగళార్చన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్‌కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని), వీడియో ఎడిటింగ్ చేసిన ఆక్వా వర్క్స్ (రాజేష్ వి ఎం మూర్తి) ఆడియో సహకారం అందించిన జ్యోత్స్నా శ్రీకాంత్ (వయోలిన్), అభిషేక్ ఎం (మృదంగం), శరత్ శ్రీనివాస్ (మిక్సింగ్)లకు భాగవత ప్రచార సమితి తరపున  హృదయ పూర్వక ధన్యవాదములు. చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల గారు, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, కుమారి దంటు శ్రీయ, చి. మౌర్య ఊలపల్లిలకు మా సంస్థ హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ మహత్కార్యక్రమాన్ని చూసిన వారికి, సహకరించిన వారికి  హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు.

చదవండి: ‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’

మరిన్ని వార్తలు