టెక్సాస్‌ కాల్పుల ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆందోళన: రత్నాకర్‌

8 May, 2023 09:27 IST|Sakshi

ఇటీవల అమెరికాలో వరుస ఘటనలు

డల్లాస్ షాపింగ్ మాల్ పార్కింగ్ లాట్ లో కాల్పులు

ఆందోళనలో ప్రవాసాంధ్రులు

అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దక్షిణాది రాష్ట్రమైన టెక్సాస్‌లో చాలా మంది భారతీయులు, అందులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు. డల్లాస్ లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నార్త్‌ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ అన్నారు.

డల్లాస్‌ అల్లెన్‌ ప్రీమియం మాల్‌ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసిందని, ఐశ్వర్య ఇందులో ఉన్నారని, గాయపడ్డ వారిలో మరో ఇద్దరు కూడా తెలుగు వారున్నారని, వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉంటోన్న ప్రవాసాంధ్రులు నిత్యం జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ జాగ్రత్తలు పాటించండి 
ఇటీవల చోటు చేసుకుంటోన్న కాల్పుల ఘటనలు, ఇతర దాడుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 
► కాల్పుల తరహలో ఏవైనా ఘటనలు లాంటివి జరిగినపుడు వీలైనంత వరకు బయటకు రావొద్దు
► ఎదుటి వారికి కనిపించేలా పరుగులు తీయొద్దు, మన ఆచూకీ తెలియనివ్వకుండా నక్కి ఉండండి
► కాల్పుల శబ్దం విన్నప్పుడు, అది మరీ దగ్గరగా ఉంటే పూర్తిగా నేలపైనే పడుకుని ఉండండి. పైకి కనిపించొద్దు.
► ఆందోళనకు గురి కావొద్దు, హడావిడిగా అటు, ఇటు పరుగులు తీయొద్దు
► బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి, మాతృభాషను తక్కువగా వాడాలి
► చుట్టుపక్కల అనుమానస్పద కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచండి


► ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అనుమానం వస్తే, ఎక్కడైనా ట్రాప్ అయ్యామని అనిపిస్తే వెంటనే అలర్ట్‌ కండి. 911కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి
► ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు
► బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడొద్దు
► చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడండి, సున్నితంగా అక్కడి నుంచి తప్పుకోండి.


► మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు
► 911 నంబర్‌కు ఫోన్‌ చేసేందుకు అస్సలు సంకోచించవద్దు, పైగా పోలీసులతో పాటు వైద్యంతో పాటు ఏ రకమైన సాయమైనా క్షణాల్లో దొరుకుతుంది
► అమెరికాలో పరిస్థితులు చాలా వరకు సురక్షితమే. అయితే ఒకటో, రెండో నేర ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. 
► ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.
చదవండి: టెక్సాస్‌ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి

మరిన్ని వార్తలు