మరోసారి నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్‌ నియామకం

1 Oct, 2021 21:19 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ ను సీఎం వైయస్ జగన్ మరోసారి ఎంపిక చేశారు. 2 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2019 సెప్టెంబర్లో బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ ఇప్పుడు మరో 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రత్నాకర్ పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా అమెరికాలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 

2015లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి విశేష సేవలు అందించారు. సీఎం వైయస్ జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రెండో సారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్, పార్టీలో ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని రత్నాకర్ తెలిపారు. 

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(నార్త్ అమెరికా) తనను మరోసారి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, సీఎం జగన్ గారికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శమని, విద్య- వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రత్నాకర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు