'ఆటా' ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

11 Mar, 2021 14:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం(మార్చి 7) రోజున నిర్వహించింది. ‘చూస్ టు ఛాలెంజ్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆటా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత డీకే అరుణ, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి, సినీ దర్శకురాలు నందిని, సినీయర్‌ నటి లయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తితిదే ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ శోభారాజు అమ్మ మీద ఓ పాటతో ప్రారంభమైంది. అనంతరం ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి మాట్లాడుతూ.. మహిళలకు ఎన్నో సూచనలు ఇచ్చారు. మహిళలు తమ ఆలోచనా విధానం మార్చుకుంటే చక్కటి అవకాశాలు పొందవచ్చన్నారు.  పూర్తి సామర్ధ్యలు వినియోగించుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, స్త్రీ శక్తి ముందు ఏదైనా దిగ దిడుపే అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని, కుటుంబలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందిచటంలో, మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని కొనియాడారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. స్త్రీలు మగ వారి కంటే అన్ని విషయాలలో ఒక అడుగు ముందే వుంటారన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, అయినా ఇంకా ఎంతో చేయవలసింది ఉందన్నారు. బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్  డీకే అరుణ ఆటా సబ్యులని, మహిళామణులని అభినందించారు.

మహిళలు పాలనా పరమైన సెగ్మెంట్లో ఆటా మొదటి మహిళ ప్రెసిడెంట్ సంధ్య గవ్వ గారు మహిళ సాధికారత మీద ప్రసంగించారు. సినీ నటి లయ మాట్లాడుతూ.. మహిళలు స్వీయ విశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. నంది అవార్డు గ్రహీత డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ... మహిళలు ఏదైనా సాధించగల దృఢ చిత్తం కలవారు అని కొనియాడారు. ఆటా ఉమెన్స్ కోఆర్డినేటర్ అనిత యజ్ఞిక్ ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆటా మహిళామణులు అభినందించారు. ఆటా కార్యవర్గం, ట్రస్టిస్‌‌ మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు