భారతీయులకు శుభవార్త ! వెల్‌కమ్‌ టూ ఆస్ట్రేలియా

22 Nov, 2021 14:08 IST|Sakshi

ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారతీయులకు గొప్ప ఊరట లభించింది. దాదాపు ఏడాది కాలంగా ఇండియన్ల రాకపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ 2021 నవంబరు 22న ప్రకటన చేశారు.

కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత 2020 మే నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్లాన్‌ చేసుకున్న వారిలో చాలా మంది ఎక్కడివారక్కడే ఆగిపోయారు. ఇటీవల ప్రపంచ దేశాలు కోవిడ్‌ ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తుండటంతో ఆస్ట్రేలియా నిర్ణయం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు, స్కిల్డ్‌ వర్కర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 1 నుంచి స్టూడెంట్‌ వీసా, స్కిల్డ్‌ వర్క్‌ వీసా ఉన్న వారు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందే సదరు వ్యక్తులు ఆయా దేశాల్లో రెండో డోసుల కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రయాణం సందర్భంగా చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ దగ్గరున్న వివరాల ప్రకారం సుమారు 2,35,000ల మంది విదేశీయులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. వీరిలో 1,60,000ల మంది స్టూడెండ్‌ వీసా కలిగిన వారే ఉన్నారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విదేశీయులకు 21 శాతం కేటాయించడంతో.. ప్రపంచ దేశాల నుంచి ఆసీస్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. యూఎస్‌ తర్వాత ఇండియాన్లు ఉన్నత విద్య కోసం ప్రిఫర్‌ చేస్తున్న దేశాల జాబితాలో ఆసీస్‌ కూడా ఉంది. 
 

మరిన్ని వార్తలు