London Bonalu Celebrations: లండన్‌లో ఘనంగా బోనాల జాతర వేడుకలు

5 Jul, 2022 16:42 IST|Sakshi

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో బోనాల జాతర

ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులు హాజరైన ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 మందికి పైగా ప్రవాస  సభ్యులు హాజరయ్యారు.

టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమానికి అధికార ప్రతినిధి హరిగౌడ్ వాఖ్యాతగా వ్యవహరించారు. సాంప్రదాయ బద్దంగా పూజలు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ఎన్నారైలను ముగ్ధులను చేశాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం పోతురాజు వేషధారణ ఆకట్టుకుంది. సందీప్ కుమార్ బుక్క బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. 


భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ, టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సేవలను కొనియాడారు.

ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తొట్టెల ఊరేగింపు అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను  సత్కరించి, బహుమతులందజేశారు. ఎంపీ రూత్ క్యాడ్బరి కూడా  ఈ ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని కోరారు.

టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలుస్తున్న ఎంఎల్‌సీ కవితకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించు కున్నామన్నారు.

టాక్ జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆమె సభకు వివరించారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు-బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్‌ అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపి, వారిని సత్కరించారు.

తెలంగాణలో జరిగే అభివృద్ధి మన దేశమంతా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలంతా నినదించారు. ‘ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే’ ఉదయ్ నాగరాజు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి మహాశక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు  ఆకట్టుకున్నాయి. 

ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది. అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు.. పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృధ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు