ఎన్నారైలకు సీబీఎస్‌ఈ శుభవార్త! స్కూల్‌ అడ్మిషన్లపై కీలక ప్రకటన

26 Nov, 2021 14:16 IST|Sakshi

విదేశాల్లో ఉన్న నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్లకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) శుభవార్త తెలిపింది. ఎన్నారై పిల్లల చదువుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 

ఇక్కడ చదివించాలంటే
గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాల్లో విద్యా చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొందరు తమ పిల్లలను ఇండియాలో చదివించేందుకు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మిస్‌ అవకూడదని తమ సంతానానికి ఇండియాలో ఎడ్యుకేషన్‌ అందించాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి వారంతా తమ పిల్లలను ఇండియాలో సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. ఇలాంటి ఎన్నారై విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి సీబీఎస్‌ఈ కొన్ని మార్గదర్శకాలు అమలు చేస్తోంది.  

గతంలో
సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఇక్కడి స్కూళ్లలో అడ్మిషన్‌ పొందాలంటే విదేశాల్లో సీబీఎస్‌సీకి సరిసమానమైన సిలబస్‌ అందిస్తున్న ఎడ్యుకేషన్‌ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూల్‌లో విద్యార్థులు చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను సీబీఎస్‌ఈకి సమర్పించాలి. వాటిని పరిశీలించి సీబీఎస్‌ఈ అప్రూవల్‌ ఇస్తుంది. ఆ తర్వాతే స్థానికంగా అడ్మిషన్లు ఖరారు అవుతాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేపట్టే అడ్మిషన్లలో ఈ రూల్‌ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు.

కోవిడ్‌ కారణంగా
కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో నిబంధనలు కఠినతరమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేదంటే జీతాల్లో కోత పడింది. దీంతో తమ పిల్లలను ఇండియాలో చదివించాలని భావించే పేరెంట్స్‌ సంఖ్య ఒ‍క్కసారిగా పెరిగింది. అయితే సీబీఎస్‌ఈ ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి.

చేర్చుకోండి
ఎన్నారైలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రూల్స్‌ని సీబీఎస్‌ఈ సడలించింది. సీబీఎస్‌ఈకి సరి సమానమైన సిలబస్‌ అందించని విదేశీ బోర్డులకి అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చదివిన విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందస్తుగా బోర్డు నుంచి ఎటువంటి అప్రూవల్‌ లేకుండానే అడ్మిషన్‌ ఇవ్వవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో విద్యార్థిని పరీక్షించి నిర్ణయం తీసుకోవచ్చంది. చివరగా అడ్మిషన్లు ఖరారు చేసేందుకు బోర్డుకు రిక్వెస్ట్‌ చేయాలని సూచించింది. సీబీఎస్‌ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలకు ఊరట లభించనుంది. 
 

చదవండి: ఎన్నారైలు.. తరాలు మారినా.. మూలాలు మరవడం లేదు

>
మరిన్ని వార్తలు