టీపాడ్‌ ఆధ్వర్యంలో మరింత ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు

1 Sep, 2022 21:50 IST|Sakshi

విదేశాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారి దృష్టిని ఆకర్షించిన అమెరికాలోని డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్‌) తాజాగా బతుకమ్మ పండుగను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. అదే స్థాయిలో దసరా వేడుకలకూ సన్నాహకాలు ప్రారంభించింది. గతంలో దాదాపు పన్నెండు వేల మందితో బతుకమ్మ పండుగను నిర్వహించగా ఈసారి సుమారు 16వేల మందితో  మరింత ఘనంగా, మహా సంబరంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నది. డాలస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టాలని నిశ్చయించింది.

అక్టోబర్‌ 1న కొమెరికా ఈవెంట్‌ సెంటర్‌ (డాక్టర్‌ పెప్పర్‌ ఎరెనా) వేదికగా నిర్వహించే ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్‌, అర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఈ సందర్భంగా టీపాడ్‌ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్‌ ఈవెంట్‌ సెంటర్‌లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్‌ ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ అజయ్‌ రెడ్డి, రఘువీర్‌ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్‌, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు.

కాలిఫోర్నియాలో నివాసముంటున్న హెల్త్‌కేర్‌ మొఘల్‌ డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి..  పెద్దఎత్తున నిర్వహించబోయే ఈ వేడుకలకు తన మద్దతు ప్రకటించారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తమవంతు సహాయసహకారాలందిస్తామని ప్రకటించారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు. కాగా, ఇటీవలే టీపాడ్‌ డాలస్‌లో తిరుమల వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని టీటీడీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు