ఆటా వార్‌ రూం : ఢీ అంటే ఢీ

27 Jun, 2022 18:43 IST|Sakshi

ప్రిపరేషన్ తో కళాకారుల బిజీ బిజీ

ఏర్పాట్లలో తలమునకలయిన కమిటీలు

తెర ముందు కొందరు, తెర వెనక వందలాది మంది

వాషింగ్టన్ డీసీలో ఆటా సంబరాలకు రంగం సిద్ధం 

మూడు రోజుల గ్రాండ్‌ కన్వెన్షన్‌కు సిద్ధమవుతున్నారు ఆటా యోధులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ప్రిపరేషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ సన్నాహకాలకు వార్‌ రూం ఏర్పాటు చేసుకున్నారు.

జులై 1,2,3 తేదీల్లో జరగనున్న అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ ప్రపంచ తెలుగు మహాసభలకోసమే ఈ కసరత్తు. వార్‌ రూంకు ఇప్పటికే చేరుకున్న కళా బృందాలు తమ ప్రతిభా పాటవాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. గతానికి భిన్నంగా, మరింత సృజనాత్మకంగా, కొత్త కళా రీతులతో కొంగొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆటా కల్చరల్‌ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీలు వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

ఇక్కడ కనిపిస్తున్న చాలా మంది పిల్లలు అమెరికాలో పుట్టిపెరిగిన వాళ్లే. అయితే తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని మాత్రం తల్లితండ్రుల నుంచి గుర్తు పెట్టుకున్నారు. పేరేంట్స్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు అమ్మమ్మ, నానమ్మ ఇళ్లకు వెళ్లి ఇక్కడి విషయాలు గమనిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యంలో ఉన్నా తెలుగును మరిచిపోలేదు, ఇక్కడి మట్టివాసనను మరిచిపోలేదు. తమ కళలు, ప్రదర్శనలలో తెలుగు తత్వాన్ని చూపించే పనిలో ఉన్నారు.

అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ అధ్యక్షుడు భువనేష్‌ భుజాల, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు అలుపెరగకుండా కష్టపడుతున్నారు. వేలాది మంది అతిథులకు సంతోషం పంచేలా, ఉత్సాహం నింపేలా తమ వేడుకలు ఉంటాయని హామీ ఇస్తున్నారు. కన్వెన్షన్‌ సందర్భంగా ప్రతీ కమిటీ ఏ ఏ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలన్నదానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.  అందుకే వార్‌ రూంలో మరో పక్క వాడివేడి చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బాధ్యతలు పంచుకుంటున్నారు.

సుధీర్‌ బండారు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌
ఎన్నో రోజుల కష్టం ఇది. ఆటా వేడుకలు ఇప్పుడు కాదు.. చాలా రోజుల ముందుగానే మొదలయ్యాయి. సయ్యంది పాదం పేరుతో ఎన్నో రోజులుగా డాన్స్‌ కాంపిటీషన్‌లు నిర్వహించి అత్యుత్తమ కళాకారులను ఎంపిక చేశాం. అలాగే జుమ్మంది నాదం పేరుతో గాయకులను ఎంపిక చేశాం. అమెరికాలోనే పుట్టి పెరిగిన కొందరు అద్భుతంగా పాడినప్పుడు ఆశ్చర్యపోయాం. ఈ వేడుకలు కచ్చితంగా ఆహూతులను అలరిస్తాయని నమ్మకంగా చెబుతున్నాం.

కిరణ్‌ పాశం, కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌
ఒకరు కాదు, ఇద్దరు కాదు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు, వీరే కాకుండా పరోక్షంగా మరెంతో మంది సహకారంతో ఈ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ తమ వృత్తి బాధ్యతలను పక్కనబెట్టి.. ఈ వేసవి కాలాన్ని అత్యంత ఆహ్లదంగా మార్చేందుకు, ఆటా వేడుకలను అత్యంత మధురంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చే మూడు రోజులు మరింత ఉధృతంగా ప్రాక్టీసు సెషన్లుంటాయి. బ్రహ్మండమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటామన్న విశ్వాసం ఉంది. 

- (వాషింగ్టన్ డిసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
 

మరిన్ని వార్తలు