What Is ECR And ECNR: ఈసీఆర్‌, ఈసీఎన్నార్‌ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ?

11 Apr, 2022 11:27 IST|Sakshi

భారత పౌరుల భద్రతకే ప్రాధాన్యం

18 దేశాలకు వెళ్లేవారికి తప్పనిసరి

విజిట్, టూరిస్టు వీసాలకు ఎమిగ్రేషన్ అవసరం లేదు

ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం భారత ప్రభుత్వం 18 దేశాలను ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ - విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి అనుమతి అవసరమైన) క్యాటగిరీ గా నోటిఫై చేసింది. వీటిని స్పెసిఫైడ్, నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ అని కూడా అంటారు. 

ఆ 18 దేశాలు
ఈ పద్దెనిమిది దేశాలలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కి చెందిన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అవి బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యూఏఈ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా,.మలేసియా, సుడాన్,  సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ దేశాలున్నాయి. 

ఈసీఆర్ పాస్ పోర్ట్ ఎందుకు?
ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ పాస్‌పోర్టునే సింపుల్‌గా ఈసీఆర్‌ పాస్‌పోర్టు అంటున్నారు. దీని ప్రకారం నోటిఫై చేసిన 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అంటే ఈ పాస్‌పోర్టు కింద విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి విదార్హత, సామాజిక అంశాలపై పట్టు,  లోకజ్ఞానం తక్కువ ఉన్నాయని అర్థం. వీరు అమాయకులు, బలహీనులుగా ఉన్నందున ఈ 18 ఈసీఆర్ దేశాలలోని కార్మిక చట్టాలు, వివిధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని... వల్నరబుల్ (హాని పొందడానికి అవకాశం వున్న) భారత పౌరుల రక్షణ, సంక్షేమం కొరకు భారత ప్రభుత్వం ఈసీఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తక్కువ నైపుణ్యం కలిగి, శారీరిక శ్రమ చేసే విదేశాలలోని భారతీయ కార్మికులను (బ్లూ కాలర్ వర్కర్స్) రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం.

క్లియరెన్స్‌.. ప్రయోజనాలు
ఈసీఆర్ పాస్ పోర్ట్ కలిగిన కార్మికులు ఈ 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు... లైసెన్స్ కలిగిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని పీఓఈ (ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ - వలసదారుల సంరక్షులు) కార్యాలయం ద్వారా ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. వలస కార్మికునికి సంబంధించిన పాస్ పోర్ట్, యాజమాన్య కంపెనీ, రిక్రూటింగ్ ఏజెన్సీ, జీతం అగ్రిమెంట్ తదితర వివరాలు ఈ-మైగ్రేట్ సిస్టం లో నమోదు అవుతాయి. ఈసీఆర్ పాస్ పోర్టు కలిగినవారికి  ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీని 'మాండేటరీ' (చట్టబద్దంగా తప్పనిసరిగా) జారీ చేస్తారు. రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు.  
             
ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ అంటే...
ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్. విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు.. అని అర్థం. 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా విదేశాల్లో మూడేళ్ళ అనుభవం ఉన్నవారికి లేదా ఆదాయపు పన్ను (ఐటి) చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అనగా వీరు తెలివైనవారు, లోకజ్ఞానం కలిగినవారు, ఏదైనా కష్టం వస్తే తమను తాము రక్షించుకోగల సామర్థ్యం ఉన్నవారు అని అర్థం. వీరు కూడా ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు.

వీరికి అక్కర్లేదు
ఎలాంటి పాస్ పోర్ట్ కలిగిన వారయినా...  విజిట్ సీసా, టూరిస్టు వీసాలపై.. ఉద్యోగానికి కాకుండా విహారయాత్రలకు, వైద్యం లాంటి ఇతర అవసరాలకు ఈ 18 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. రాను పోను విమాన ప్రయాణ టిక్కెట్టు, విజిట్, టూరిస్ట్ వీసా ఉంటే సరిపోతుంది.  

- మంద భీంరెడ్డి, వలస వ్యవహారాల విశ్లేషకులు (+91 98494 22622)

చదవండి: వలస కార్మికుల ఆశలు ఆవిరి

మరిన్ని వార్తలు