ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్

16 Mar, 2023 18:33 IST|Sakshi

ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.

ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు.

విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు