-

‘గల్ఫ్ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం’

22 Sep, 2022 20:06 IST|Sakshi

ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తుంది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీ గురువారం తెలంగాణ గల్ఫ్ వలసలపై జాతీయ వర్చువల్ సింపోజియం (ఆన్ లైన్ చర్చ) నిర్వహించింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ఈ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి మాట్లాడారు.

గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల జనాభా 2 కోట్ల యాభై లక్షలు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. ఫారెక్స్ నిల్వలు 2 సంవత్సరాల కనిష్ట స్థాయి 564 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. 

భారత ప్రభుత్వం పేద కార్మికులను విదేశాలకు పంపుతూ ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాస కార్మికుల బతుకులు మారడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. 


ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్న మంద భీంరెడ్డి

వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు.  

తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి  సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ (లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు) పంపితే అది రూ . 14,000 కు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ. 14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు అవుతుంది. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా  వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీ సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో  ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ. 1,260 కోట్లు లాభపడుతున్నది. 

ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఎగుమతులను పెంచడం, దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం మరియు భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. 

గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్ ఫ్లయిట్  టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు లేదా 45 రోజుల జీతాన్ని ఫీజుగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం అని మంద భీంరెడ్డి అన్నారు. డా. జునుగురు శ్రీనివాస్, డా. రౌల్ వి. రోడ్రిగ్జ్, డా. జె. సంతోష్, డా. నరేష్ సుదవేని,  డా. పి. వి. సత్య ప్రసాద్, వలస కార్మికుల ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షకుడు బి. ఎల్. సురేంద్రనాథ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు