నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం..

18 May, 2022 12:08 IST|Sakshi

ఎన్నారై సంబంధాలకు ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని ఓ విదేశీయుడు హైదరాబాద్‌కు చెందిన యువతిని బురిడీ కొట్టించాడు. మాయ మాటలు, కట్టుకథలు అల్లి ఆమె నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చివరకు అరెస్టై కటకటాలు లెక్కపెడుతున్నాడు.

విదేశీ మోసగాడు
ఐవరీ కోస్టు దేశానికి చెందిన అమర ఫ్యానీ(24) అనే యువకుడు మ్యాట్రిమొని సైట్‌లో తనను తాను ఓ ఎ‍న్నారైగా పేర్కొంటూ తప్పుడు పేరు, అడ్రస్‌తో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. దీన్ని చూసి నమ్మిన హైదరాబాద్‌కి చెందిన యువతి అతనితో సంభాషణ ప్రారంభించింది. ఈ క్రమంలో హైదరాబాదీ యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెబుతూ నమ్మకం కలిగించాడు.

కస్టమ్స్‌ పేరుతో
ఉన్నట్టుండి హైదరాబాదీ యువతకి ఒకరోజు కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఫోన్‌ కాల్‌ వచ్చింది. తనను చూసేందుకు ఇండియా వస్తున్న అమర ఫ్యానీని అక్రమంగా ఫారెన్స్‌ కరెన్సీ ఉన్నందువల్ల అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు... ఈ వివాదం నుంచి బయట పడేందుకు ఆ యువతి వివిధ బ్యాంకు ఖాతాల నుంచి ఫ్యాన్నీ తెలిపిన నంబర్లకు రూ.11 లక్షల వరకు మనీ సెండ్‌ చేసింది. ఆ తర్వాత అటువైపు నుంచి కమ్యూనికేషన్‌ కట్‌ అయిపోయింది.

పరారీ యత్నం
కొన్ని రోజులకు మోసపోయినట్టు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా విచారణలో అమర ఫ్యానీతో పాటు అతని స్నేహితుడు నైజీరియన్‌ ఐకే ఫినిచ్‌ (32)కి కూడా ఈ మోసంలో భాగం ఉన్నట్టు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా భవనం దూకి పారిపోయే క్రమంలో ఫినిచ్‌ తీవ్రంగా గాయపడి కోలుకుంటుండగా.. అమరఫ్యానీ పోలీసుల అదుపులో ఉన్నాడు. వీరిద్దరు ఎన్నారై పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వీరి గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు.

చదవండి: వలస కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌
 

మరిన్ని వార్తలు