చలికి తాళలేక అమెరికా సరిహద్దులో చనిపోయిన నలుగురు భారతీయులు

28 Jan, 2022 17:11 IST|Sakshi

కెనాడాలో విషాదం చోటు చేసుకుంది. తమ కలలను పండించుకునేందుకు విదేశీ బాట పట్టిన ఓ భారతీయ కుటుంబం దారి మధ్యలోనే తనువు చాలించింది. విషాద ఘటన కెనడా - అమెరికా సరిహద్దులో జనవరి 19న చోటు చేసుకుంది. 

కెనాడలో చనిపోయిన భారత కుటుంబానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. వీటి ప్రకారం... కెనడా - అమెరికా సరిహద్దులో జనవరి 19న అమెరికా అధికారులు గస్తీ కాస్తుండగా మానవ అక్రమ రవాణా చేస్తున్న స్టీవ్‌ శాండ్‌ అనే అమెరికా పౌరుడిని అధికారులు అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో అమెరికా సరిహద్దులో కెనాడా వైపు కొన్ని మృతదేహాలు కనిపించాయి. వీరంతా గడ్డకట్టే చలికి తట్టుకోలేక చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే కెనడా అధికారులకు సమాచారం అందించారు. వారు మృత దేహాలను పరిశీలించగా వారు భారతీయులుగా తేలింది. పోలీసుల విచారణలో చివరకు మృతులను గుజరాత్‌కి చెందిన జగదీశ్‌ బల్‌దేవ్‌భాయ్‌ పటేల్‌ (39) అతని భార్య వైశాలినిబెన్‌ (37), కుమార్తె విహంగి (11), కొడుకు ధార్మిక్‌ పటేల్‌ (3)లుగా తేలింది. వీరంతా టూరిస్టు వీసా మీద జనవరి 12న కెనాడాకు చేరుకున్నారు.

కెనడాలో చనిపోయిన జగదీశ్‌ కుటుంబం స్వస్థలం గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లా కలోల్‌ తహశీల్‌లోని దింగుచా గ్రామంగా తెలిసింది. ఈ గ్రామం నుంచి చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు అధికారిక పత్రాలతో వెళ్లి విదేశాల్లో సెటిలవగా మరికొందరు టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విదేశాల్లో జీవించడం ఈ గ్రామంలో గౌరవంగా పరిగణిస్తారు. విదేశాల్లో బంధువులు లేకపోతే ఇక్కడ పెళ్లి సంబంధలు కూడా దొరకడం కష్టమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతోంది. ఆ గ్రామంలో ఉన్న అందిరిలాగే తాను కూడా కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడాలని జగదీశ్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో గ్రామంలో  తనకున్న 12 ఎకరాల పొలాన్ని విడిచి ఇంట్లో పెద్దలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా జనవరి 12న కుటుంబంతో సహా కెనాడా ఫ్లైట్‌ ఎక్కారు. అక్కడ తెలిసిన వారి సాయంతో అనధికారికంగా అమెరికాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  జనవరి 19న స్థానిక ఏజెంట్ల సాయంతో కెనడాలోని మానిటోబా దగ్గర సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. సరిహద్దులో ఉండే అధికారుల కళ్ల బడకుండా ఉండేందుకు ప్రధాన రహదారి, వాహనాలను విడిచి... కాలి నడకన  సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

జగదీశ్‌ కుటుంబం సరిహద్దు దాటే క్రమంలో మైనస్‌ 35 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచు విపరీతంగా కురవడంతో పాటు తీవ్రమైన గాలులు వీయడం మొదలైంది. ఈ ప్రతికూల వాతావరణానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడంలో జగదీశ్‌ కుటుంబం విఫలమైంది. మరోవైపు సరిహద్దు దాటించేందుకు సాయం చేస్తానన్నా ట్రావెల్‌ ఏజెంట్లు .. గస్తీ ఎక్కువగా కావడంతో మార్గమధ్యంలోనే వారిని వదిలేశారు. ఈ విపత్కర పరిస్థితిలో చలికి తట్టుకోలేక అమెరికా సరిహద్దులకు సమీపంలో కెనెడా వైపు వీరు ఊపిరి వదిలారు. తమ కలల జీవితం నెరవేర్చుకునే క్రమంలో విగత జీవులుగా మారారు.

మరోవైపు జగదీశ్‌ కుటుంబం కెనాడా వెళ్లిన తర్వాత నుంచి గుజరాత్‌లో ఉన్న అతని కుటుంబం ఆందోళన చెందుతోంది. జనవరి 12 నుంచి జగదీశ్‌ ఫోన్‌లో అందుబాటులో లేడని అతని తండ్రి బల్దేవ్‌ ఆందోళన చెందుతున్నాడు. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారు సరైన పత్రాలతోనే రావాలంటూ ప్రవాస భారతీయులు సూచిస్తున్నారు. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు