తెలుగు స్టోరీకి ఫ్రాన్స్ డైరెక్టర్లు ఫిదా.. ఖండాంతరాలు దాటిన తెలుగు జర్నలిస్ట్ ఘనత!

31 Mar, 2023 19:57 IST|Sakshi

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గురించి కానీ, ఆయన రచించిన 'బ్లడ్‌ సాండర్స్‌ - ది గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌' గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు పాఠకులకు సుపరిచయమైన సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై రచించిన ఈ పరిశోధనాత్మక రచనను గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.

ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్‌ జర్నలిస్ట్ సుధాకర్‌ రెడ్డి ఇప్పుడు అరుదైన ఘనతను సాధించారు. ఈయన ఫ్రెంచ్ భాషలో త్వరలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్‌ చేశారు. తిరుమల అడవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఎర్రచందనం గురించి ఈయన పుస్తక రూపంలో బయటపెట్టారు. ఎంతో మంది పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు.

సుధాకర్ రెడ్డి త్వరలో ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధానంగా అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు.

2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో సుధాకర్‌ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇది నిజంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన, అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్‌పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు.

సాహుల్ హమీద్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్న ఎర్రచందనం కాజేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్‌లలో చేశారు. అంతే కాకుండా చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలో కూడా షూటింగ్ జరిపారు.

సాహుల్ హమీద్ విషయానికి వస్తే, యితడు అనేక నేరాలకు పాల్పడి దాదాపు 120 మిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించినట్లు ఇతనిపై అనేక వార్తలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తరువాత సాహుల్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

సాహుల్ హమీద్ ఎర్రచందనం ఎలా దొంగిలిస్తాడు? అతని ముఠా ఎంతవరకు విస్తరించి ఉంది? అనే వివరాలు ఏప్రిల్ 3న ఎపిసోడ్‌లో ప్రసారమవుతాయి. ఫ్రాన్స్ డైరెక్టర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు.

త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో పర్యావరణాన్ని నాశనం చేయడానికి నేరగాళ్లు ఎలా పాల్పడుతున్నారు? పర్యావరణం వారి వల్ల ఎలా నాశనమవుతోంది? అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నాశనం చేస్తున్నారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పినందుకుంటున్నారు? పోలీసులు వారిని ఎలా వెతుకుతున్నారనే విషయాలన్నీ సమగ్రంగా వివరించారు.

ఈ డాక్యుమెంటరీలో మన తెలుగు తేజం సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్‌ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేయడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఇది తెలుగు జర్నలిస్టుకు దొరికిన గొప్ప అవకాశం. ఇది అదృష్టం అనటం కంటే కూడా, శ్రమ, పట్టుదల, లోతైన విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పాలి. భవిష్యత్తులో ఈయన మరింత గొప్ప స్థాయికి చేరాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం..

మరిన్ని వార్తలు