‘ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది’

5 Jan, 2023 13:40 IST|Sakshi

భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పలపాటి వెంకయ్య నాయుడు నాలుగురోజుల దుబాయి పర్యటనలో భాగంగా తెలుగు అసొసియేషన్ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడును తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ కుమార్ ఉగ్గిన సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి దేశానికి వెంకయ్య నాయుడుగారు చేసిన సేవలను కొనియాడరు. 

అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జనని, జన్మభూమి, చదువుచెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని, మనిషికి మాతృభాష కళ్ళవంటిది అయితే ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను  కాపాడుకోవాలని కోరారు. భారతదేశంలో మన వేద పురాణ కాలం నుండే మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోది పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని,ప్రోత్సాహించాలని కోరారు. 

ప్రపంచం శర వేగంతో ముందుకు వెళ్తోందని, మన భారతదేశం నిపుణతకు, మేధస్సు, నిజాయితీ లకు పెట్టునిల్లు అని, సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర పరిశ్రమతో విశ్వగురువుగా మళ్ళీ అవతరించబోతోందని చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక,వైజ్ఞానికరంగాల్లో భారత్‌దే పైచేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన  పూర్వ వృత్తాంతన్ని మననం చేసుకుంటూ, మన మూలాలను మరవకుండా,  మనుగడను కొనసాగించి పురోభివృద్ది చెందాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కొరకు పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు 

య.ఏ.ఈ లోని ఉభయ రాష్ట్రాల తెలుగు వారిని సంఘటిత పరుస్తూ, తెలుగు సంసృతిని సంరక్షిస్తున్న తెలుగు అసోసియేషన్ సేవలను నువెంకయ్యనాయుడు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా దుబాయిలోని చిన్నారులు చేసిన కూచిపూడినృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, ఎస్‌ఆర్‌ఆర్‌బిల్డింగ్ మెటేరియల్స్ అధినేత తోట రామకుమార్, దినేష్ కుమార్ ఉగ్గిన వెంకయ్యనాయుడుని సన్మానించి, సన్మాన పత్రం, శాలువా,జ్ఞాపికలను బహుకరించారు. 

ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవి లు సంధానకర్తలు గా వ్యవహరించారు. తెలుగు అసోసియేషన్‌ తరఫున శ్రీధర్ దామెర్ల,విజయ్ భాస్కర్, మోహన్ ఎంవీఎస్‌కే,అంబేడ్కర్, లతా నాగేశ్, ఫహీమ్, శ్రీనివాస్ యండూరి, సురేంద్ర దండేకుల,నూకల మురళీ కృష్ణకార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.

మరిన్ని వార్తలు