భారతీయ సంస్కృతి.. ప్రపంచానికి దిశానిర్దేశం: వెంకయ్య నాయుడు

18 Oct, 2022 13:42 IST|Sakshi

ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దసరా దీపావళి పండుగలు సందర్భంగా సింగపూర్ తెలుగు వారందరితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరింప చేస్తూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై సింగపూర్ తెలుగు ప్రజలకు, నిర్వాహక బృందానికి తమ అభినందనలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  గత రెండేళ్ళ కాలంలో సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కోశాధికారి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు. సింగపూర్ గాయని గాయకులచే సంప్రదాయక భక్తి గీతాలు, సాయి తేజస్వి, అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు, తేటతెలుగు పద్యాలాపన ప్రేక్షకులందరినీ అలరించాయి.

శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించిందన్నారు. తమ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుంచి ఎదురు చూస్తున్నామని ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని" ఆనందం వ్యక్తం చేశారు.

సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కలసి వెంకయ్య నాయుడుని అభిమానపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంస్థ సభ్యులు హాజరై శ్రీ సాంస్కృతిక కళాసారథిని అభినందించారు.

మరిన్ని వార్తలు