గల్ఫ్‌లో టీకా సర్టిఫికెట్ల తిప్పలు 

23 Jul, 2021 16:24 IST|Sakshi

ఇండియన్‌ టీకా సర్టిఫికెట్ల అప్ లోడ్ సమస్య

ఇండియన్ ఎంబసీలు చొరవ చూపాలి  


ఇండియా నుంచి గల్ఫ్‌ కు వెళ్లే భారతీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోవీషీల్డ్‌ టీకా తీసుకుంటే ఇబ్బంది లేదన్న ధైర్యంతో ఉ‍న్న ప్రవాస భారతీయులకు ఊహించిన సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం కోవిన్‌ యాప్‌ ద్వారా జారీ చేసిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ని కొన్ని గల్ఫ్‌ దేశాలకు చెందిన యాప్‌లు స్వీకరించడం లేదు. 

ఇబ్బందులు
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రతీ దేశానికి వేర్వేరుగా యాప్‌లు ఉన్నాయి. మన ప్రభుత్వం కోవిన్‌ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు కొన్ని గల్ఫ్ దేశాల ఆరోగ్య శాఖ యాప్ లలో తమ ఆరోగ్య స్థితిని నమోదు చేసుకునే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి యాప్‌లు కోవిన్‌ను స్వీకరించడం లేదు. 

ఆర్థిక భారం
గల్ఫ్‌ దేశాల యాప్‌లలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఢిల్లీలోని గల్ఫ్ దేశాల ఎంబసీలతో కోవిడ్‌ టీకా సర్టిఫికేట్‌ అటెస్ట్ చేసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.6,500 నుంచి రూ.8,000 ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ‘తవక్కల్నా' యాప్‌లో ఆరోగ్య స్థితిని మోసపూరితంగా అప్‌డేట్ చేసినందుకు గాను అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, విదేశీ కార్మికులతో సహా 122 మంది ఇటీవల సౌదీలో అరెస్టు అయ్యారు. 

ఎంబసీలు చొరవ చూపితే
భారతీయ టీకా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్ పోర్టల్ ను గల్ఫ్ దేశాలు గుర్తించేలా మన ఎంబసీ అధికారులు కృషి చేయాలని గల్ఫ్‌లో ఉన్న భారతీయులు కోరుతున్నారు. కోవిన్‌  క్యూఆర్ స్కాన్ కోడ్ ఉపయోగించి టీకా సర్టిఫికెట్ ను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు