భారత్ జోడో యాత్ర: గల్ఫ్ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం

27 Oct, 2022 21:34 IST|Sakshi

పున:ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో పాల్గొనేందుకు పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం బొందల్‌కుంట తాత్కాలిక శిబిరంలో 'యాత్రీస్' ఇతర ప్రముఖులకు వసతి ఏర్పాటు చేశారు.

శిబిరంలో మధ్యాహ్న భోజనం సందర్భంగా కొందరు సహ యాత్రికులతో గల్ఫ్ కార్మిక నాయకులు ముచ్చటించారు. రాజ్య సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్, తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, సామాజిక ఉద్యమకారిణి సజయ కాకరాల, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి లను గల్ఫ్ జేఏసీ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డిలు కలిశారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ పాదయాత్ర ద్వారా తమకు ఒక అవకాశం లభించిందని సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మిక నాయకుల రెండవ బృందం నవంబర్ 1 నుంచి యాత్రలో పాల్గొంటుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు