గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ 

19 Oct, 2022 16:23 IST|Sakshi

రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా హామీ తప్పొద్దు

జగిత్యాల జిల్లాలో  కన్నీటి వీడ్కోలు

గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా ఇక నుంచి అధికార ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు గల్ఫ్ నుంచి వచ్చిన శవపేటికలను ఉంచుతామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు.  ఇటీవల దుబాయిలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజు (25) అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో జరిగాయి. గల్ఫ్ కార్మికుల అంత్యక్రియల్లో  పాల్గొని మృతుడు నాగరాజుకు రవిగౌడ్ నివాళులు అర్పించారు. 

పని ప్రదేశంలో (వర్క్ సైట్) లో జరిగిన ప్రమాద మరణానికి దుబాయిలో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రవిగౌడ్ అన్నారు. కార్మికులకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి తగిన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం, గల్ఫ్ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా ను తీసుకోవాలని రవిగౌడ్ కోరారు. రూ. 325 చెల్లిస్తే రెండు సంవత్సరాలు అమలులో ఉండే రూ. 10 లక్షల ప్రార్ద బీమా పాలసీ పొందవచ్చు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవిగౌడ్ కోరారు.

మరిన్ని వార్తలు