భారత్ జోడో యాత్రలో గల్ఫ్ కార్మికుల డిమాండ్లు

1 Nov, 2022 16:40 IST|Sakshi

గల్ఫ్ జేఏసీ ప్లకార్డుల ఆవిష్కరణ 

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మంగళవారం శంషాబాద్ నుంచి బోయినపల్లి మార్గంలో ఆసక్తికర సంఘటన జరిగింది. 'స్టేట్ యాత్రీ' పాసులు కలిగిన ఇద్దరు యువకులు ప్లకార్డులు పట్టుకుని భారత్ జోడో యాత్రలో నడుస్తున్నారు. ఇది గమనించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత (సీఎల్పీ లీడర్) భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వారిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

తాము తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జేఏసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్నామని అన్నారు. గల్ఫ్ వలస కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన పెరుగు మల్లికార్జున్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన దీటి నర్సింలు వారికి తెలిపారు. దేశ సమగ్రత కొరకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాత్ర ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పడానికి అడుగులో అడుగువేసి నడుస్తున్నట్లు వివరించారు. 
 

డిమాండ్ల సాధనలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల నిబద్ధత, పట్టుదల పట్ల ముగ్ధులైన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి, కాంగ్రెస్ నాయకులు డా.శ్రవణ్ కుమార్ హైదరాబాద్, బహదూర్ పురలోని లెగసీ ప్యాలస్లో ఏర్పాటు చేసిన యాత్రీస్ క్యాంప్ (వసతి శిబిరం)లో ప్లకార్డులను ఆవిష్కరించారు. భారత ప్రభుత్వం రూ.10 లక్షల 'ప్రవాసి భారతీయ బీమా యోజన' పథకాన్ని అన్ని క్యాటగిరీల గల్ఫ్ కార్మికులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి అనే డిమాండ్లతో ఉన్న మూడు ప్లకార్డులు సహ యాత్రీలను విశేషంగా ఆకర్షించాయి.

మరిన్ని వార్తలు