ఎంతటి విషాదం: పిల్లలొచ్చారు.. అమ్మానాన్న రాలేదు

2 Jan, 2023 19:43 IST|Sakshi

ప్రత్తిపాడు (గుంటూరు): అమెరికాలోని న్యూజెర్సీలో తుపాను దృశ్యాలను ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో భారీ ఐస్‌ గడ్డల నుంచి జారిపడి సరస్సులోకి జారి మృత్యువాత పడిన ముద్దన నారాయణ, హరిత దంపతుల మృతదేహాల రాక కోసం వారి కుటుంబీకులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం రీత్యా అమెరికా వెళ్లి అరిజోనాలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు గత నెల 26వ తేదీన విహార యాత్రకు వెళ్లి సరస్సులో గల్లంతై మృత్యువాత పడిన విషయం విదితమే.

కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో ఉండిపోయిన వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షిత­లను టీసీఎస్‌ కంపెనీ సహకారంతో భారత్‌­కు తీసుకువచ్చారు. శనివారం ఉదయం అమెరికాలోని డల్లాస్‌ నుంచి బయల్దేరిన ఆ పిల్లలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోగా.. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక వాహనంలో స్వగ్రామమైన పాలపర్రుకు తీసుకువచ్చి తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ వెంకటరత్నంకు అప్పగించారు. 

‘అమ్మా నాన్నలేరీ!’ 
‘నానమ్మ.. అమ్మా, నాన్నలు ఏరీ’ అంటూ నారాయణ, హరిత దం­­పతుల చిన్నకుమా­ర్తె  హర్షిత అడుగు­తు­న్న తీరు బంధువుల్ని, గ్రామ­స్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. అమ్మానాన్న మరణించారన్న విష­యం తెలియని ఆ చిన్నారిని చూసి వా­రంతా చ­లిం­చిపోతున్నారు. బాధను పంటి బి­గు­వున భరి­స్తూ చిన్నారులను ఓదార్చుతున్నారు. తల్లిదండ్రు­లు ఇక రారన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక తాతయ్యలు, నాయ­నమ్మ, అమ్మమ్మలు భోరున విలపిస్తున్నారు. ఇప్పటికే ఒక్కగానొక్క కు­మా­రుడు మృతి చెందడం, నేటికీ వారి చివరి చూ­పునకు కూడా నోచుకోని పరిస్థితులు ఉత్ప­న్నం కావడంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది.   

మరిన్ని వార్తలు