హైదరాబాద్‌ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్‌న్యూస్‌ ! కరోనా టెస్ట్‌ ముందస్తు బుకింగ్‌ షురూ

7 Dec, 2021 10:52 IST|Sakshi

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభన నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అట్‌ రిస్క్‌ కేటగిరీలో ఉన్న పదకొండు దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరి చేశారు. విదేశీ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం రిజిస్ట్రర్‌ చేసుకోవడం, శాంపిల్స్‌ ఇవ్వడం ఆ తర్వాత రిపోర్టు వచ్చే వరకు అక్కడే ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే  ఈ తతంగం అంతా ముగిసే సరికి చాలా సమయం పడుతోంది. దీంతో ఢిల్లీ ఎ​యిర్‌పోర్టులో కోవిడ్‌ పరీక్షల కోసం ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఈ తరహా ఇబ్బందులు తొలగించేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముందుస్తు టెస్టింగ్‌కి ఏర్పాటు చేశారు. 

ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సదుపాయం 
ప్రయాణికుల సౌలభ్యం కోసం ముందస్తు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రక్రియను  ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్‌ (www.hyderabad.aero) లేదా పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్‌ మై జినోమ్‌ ల్యాబ్‌ వెబ్‌సైట్‌ (http://covid.mapmygrnome.in) ద్వారా టెస్ట్‌ స్లాట్‌ణి ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అయిన తర్వాత ఏ దేశం నుంచి వస్తున్నారు.. హైదరాబాద్‌ ఎప్పుడు చేరుకుంటారు, వ్యాక్సినేషన్‌ అయ్యిందా లేదా తదితర విషయాలు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు రూ. 750, ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు రూ.3900 వరకు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే నేరుగా శాంపిల్స్‌ ఇచ్చి.. రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తే సరిపోతుంది. కోవిడ్‌ టెస్ట్‌కి ఆన్‌లైన్‌లోనే ముందుగా బుక్‌ చేసుకోవడం ద్వారా  ఎయిర్‌పోర్టులో  వెయిటింగ్‌ టైం​ తగ్గిపోతుంది. 

వెయిటింగ్‌ ఏర్పాట్లు
టెస్ట్‌ కోసం శాంపిల్స్‌ ఇచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు వచ్చేందుకు 6 గంటలు, ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ టెస్టు కోసం 2 గంటల వరకు సమయం పడుతుంది. రిపోర్ట్సు వచ్చే వరకు ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు సౌకర్యవంతంగా గడిపేందుకు వీలుగా ప్రత్యేక వెయిటింగ్‌ ఏర్పాట్లు కూడా చేశారు. 

చదవండి: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..!

మరిన్ని వార్తలు