న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌.. ప్రపంచాన మెరిసిన త్రివర్ణం

16 Aug, 2022 08:30 IST|Sakshi

బీజింగ్‌/సింగపూర్‌/అమెరికా: ప్రపంచ దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్‌ రావత్‌ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఎంబసీలో జాతీయ జెండాను ఎగురవేశారు. చైనాలోని భారతీయులు అధిక సంఖ్యలో విచ్చేసి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

భారత నావికా దళానికి చెందిన నిఘా నౌక ‘ఐఎన్‌ఎస్‌ సరయూ’ బ్యాండ్‌ సిబ్బంది సింగపూర్‌లో భారత రాయబార కార్యాలయంలో దేశభక్తి గేయాలు ఆలపించారు. కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లోను భారత స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని బోస్టన్‌లో ‘ఇండియా డే’ పరేడ్‌ సందర్భంగా 220 అడుగుల ఎత్తున ఎగురవేసిన భారత జాతీయ జెండా ప్రజలను ఆకట్టుకుంది.   

భారత్‌కు శుభాకాంక్షల వెల్లువ 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు ప్రపంచదేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తదితరులు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ‘సత్యం, అహింసా అని గాంధీజీ ఇచ్చిన సందేశం విలువైనది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా ప్రజల శాంతిభద్రతల కోసం ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని బైడెన్‌ సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్‌ మార్లెస్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, సోలిహ్, సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ తదితర ప్రముఖులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.   

ఇదీ చదవండి: వివాదంలో బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌!

మరిన్ని వార్తలు