సింగపూర్‌ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్‌’ ! కేంద్రం కొత్త ఆదేశాలు

10 Dec, 2021 19:50 IST|Sakshi

సింగపూర్‌ నుంచి ఇండియాకు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్రం తాజాగా సవరించిన అట్‌ రిస్క్‌ దేశాల జాబితా నుంచి సింగపూర్‌ని తొలగించింది. అదే సమయంలో కొత్తగా ఘనా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో చేర్చింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభనతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్‌ నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒమిక్రాన్‌ ప్రభావం నుంచి దేశాల జాబితాను అట్‌ రిస్క్‌ పేరుతో కేంద్రం ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్‌, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజీల్యాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, ఇజ్రాయిల్‌, హాంగ్‌కాంగ్‌ దేశాలు ఉన్నాయి. 

తాజాగా సవరించిన జాబితాలో సింగపూర్‌ దేశాన్ని ఈ జాబితా నుంచి తొలగించగా ఘనా, టాంజానియాలు ఇందులో చేరాయి. తాజా నిబంధనల ప్రకారం ఇకపై సింగపూర్‌ దేశం నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ నిర్థారణ కోసం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం ఎదురు చూడక్కర్లేదు. ఈ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కారణంగా దాదాపు అన్ని ఎయిర్‌పోర్టులలో అట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కనీసం రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది.  

చదవండి:అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు

>
మరిన్ని వార్తలు