వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో భారత సంతతి అమ్మాయికి స్థానం

7 Feb, 2023 13:36 IST|Sakshi

ప్రపంచంలోనే అంత్యంత తెలివైన స్టూడెంట్స్‌ లిస్ట్‌లో భారత సంతతి అమ్మాయి స్థానం దక్కించుకుంది. యూఎస్‌ ఆధారిత జాన్స్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌(సీటీవై) నిర్వహించిన పరీక్షలో భారతీయ అమెరికన్‌ నటాషా పెరియనాగం రెండోసారి విజయం సాధించింది. 13 ఏళ్ల పెరియనాగం న్యూజెర్సీలో ఫ్లోరెన్స్‌ ఎం గౌడినీర్‌ మిడల్‌ స్కూల్‌ విద్యార్థి. ఆమె గతంలో 2021లో గ్రేడ్‌ 5 విద్యార్థిగా ఉన్నప్పుడూ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐతే ఆ ఏడాది ఆమె సీటీవై నిర్వహించిన వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో గ్రేడ్‌ 8 స్థాయిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించి ఆ అత్యున్నత జాబితాలో స్థానం దక్కించుకున్నారు కూడా. 

మళ్లీ ఈ ఏడాది ఎస్‌ఏటీ, ఏసీటీ స్కూల్‌, కాలేజ్‌ స్థాయిలో అదే విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి మరోసారి ఈ గౌవరవ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సీటీవై విశిష్ట ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడం కోసం వారి విద్యా నైపుణ్యాలను వెలికితీసేలా ఏటా అత్యున్నత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, పెరియనాగం తల్లిదండ్రులు చైన్నైకి చెందిన వారు. 2021-22 సీటీవై పరీక్షకి 76 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. సుమారు 15 వేల మంది ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. వారిలో చైన్నైకి చెందిన పెరయనాగం కూడా ఉన్నారని వెల్లడించింది.

అలాగే ఈ తాజా ప్రయత్నంతో పెరియనాగం అభ్యర్థులందరి కంటే అత్యధిక గ్రేడ్‌ సాధించి వరుసగా రెండుసార్లు ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న అమ్మాయిగా నిలిచినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ మేరకు సీటీవై డైరెక్టర్‌ డాక్టర్ అమీ షెల్టాన్ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక పరీక్షలో విద్యార్థులు సాధించిన విజయం మాత్రం కాదని, చిన్న వయసులో వారి అభిరుచులను గుర్తించడమే గాక ఆ దిశ తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకోవడం ప్రశంసించదగ్గ విషయం. అలాగే వారి మహోన్నతమైన తెలితేటలకు సెల్యూట్‌. ఈ అనుభవంతో విద్యార్థులు మరిన్ని గొప్ప విజయాలను అందుకోవాలి అని డాక్టర్ అమీ ఆకాంక్షిచారు.
(చదవండి: మిస్టరీగా కిమ్‌ ఆచూకీ.. పీపుల్స్‌ ఆర్మీ వార్షికోత్సవం హాజరుపై సందిగ్ధం)

మరిన్ని వార్తలు