ఐపాడ్‌ స్కామ్‌లో కోర్టు తీర్పు.. ఎన్నారై మహిళకి 66 నెలల జైలు శిక్ష

14 Jan, 2022 14:15 IST|Sakshi

అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఐపాడ్‌ స్కామ్‌లో భారత సంతతికి చెందిన మహిళకు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పుని మేరీల్యాండ్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో భారత సంతతికి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు అమెరికన్లకు శిక్ష పడింది. 

విద్యార్థుల కోసమని
క్రిస్టినా స్టాక్‌ (46) అనే మహిళా న్యూమెక్సికో ఓ ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న గిరిజన విద్యార్థులకు ఇంటర్నెట్‌ని చేరువ చేసే లక్ష్యంతో ఐపాడ్‌లు ఉచితంగా అందివ్వాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారీ స్థాయిలో ఐపాడ్‌ కొనుగోలు చేపట్టింది. ఈ వ్యవహారాలను క్రిస్టినా స్టాక్‌ పర్యవేక్షించింది. ఈ క్రమంలో వాటిని ఆమె పక్కదారి పట్టించింది. 

ఐపాడ్‌ స్కాం
విద్యార్థులకు అందివ్వాల్సిన ఐపాడ్‌లను అమెరికన్‌ ఇండియన్‌ అయిన సౌరభ చావ్లాకి (36)కి క్రిస్టినా అందించింది. ఇలా పక్కదారి పట్టించిన ఐపాడ్‌లను ఈబే వంటి ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా సౌరబ్‌ చావ్లా విక్రయించింది. 2012 నుంచి 2018 వరకు ఇలా ఆరేళ్ల పాటు వీరిద్దరు ఈ స్కామ్‌లో ప్రధాన పాత్ర పోషించారు. మొత్తంగా ఆరేళ్లలో ఒక మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ. 7.4 కోట్లు) విలువ చేసే 3,000లకు పైగా ఐపాడ్‌లను అమ్మేశారు. 

తప్పుల మీద తప్పులు
ఈ కామర్స్‌ సైట్లలో ఐపాడ్‌లను విక్రయించే క్రమంలో చట్టానికి దొరక్కుండా తప్పించుకునేందుకు సౌరభ్‌ చావ్లా బెండర్స్‌ అనే వ్యక్తికి చెందిన పేపాల్‌, ఈ బే ఖాతాలను ఉపయోగించింది. అక్రమ పద్దతుల్లో సంపాదించిన సొమ్ము ఆదాయపన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు ఈ ముగ్గురు మరికొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మొత్తానికి ఈ మోసాన్ని 2018లో గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సౌరబ్‌ చావ్లా ప్రమేయం ఉన్న మరిన్ని క్రిమినల్‌ యాక్టివిటీస్‌ బయటపడ్డాయి.

ఐదున్నరేళ్ల శిక్ష
ఐపాడ్‌ స్కాం కేసుతో పాటు ఇతర అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న మేరిల్యాండ్‌ న్యాయస్థానం సౌరబ్‌ చావ్లాకి 66 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న క్రిస్టినాకు 18 నెలలు, జేమ్స్‌ బెండర్స్‌కి ఏడాది పాటు జైలు శిక్షని ఖరారు చేసింది. 

చదవండి: మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి

మరిన్ని వార్తలు